సిఎం కప్‌ క్రీడా పోటీలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని మరింతగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ -2003 క్రీడా పోటీల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఈ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ బుధవారం చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ -2003 క్రీడాపోటీల నిర్వహణతో పాటు నర్సరీలు, ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించడం తదితర అంశాలపై సంబంధిత అధికారులు, ఎంపీడీఓలు, ఏ.పీ.ఓలతో సమీక్షా మావేశం జరిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ నెల 15 , 16 , 17 తేదీలలో మండల స్థాయిలో అథ్లెటిక్స్‌, ఫుట్‌ బాల్‌, ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్‌ అంశాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారిని జిల్లా స్థాయి పోటీల కోసం పంపించాలని సూచించారు. 15 నుండి 36 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారందరు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. క్రీడా పోటీల నిర్వహణ కోసం మండల స్థాయిలో ఎంపీడీఓ, తహసీల్దార్‌, ఎంఈఓ, ఎంపీఓ, మెడికల్‌ ఆఫీసర్‌, పీ.డీ/పీ.ఈ.టీ, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

ఎమ్మెల్యేలతో పాటు సర్పంచ్‌ లు, ఎంపీపీలు, జెడ్పిటీసీలకు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, వారి భాగస్వామ్యంతో పోటీలను విజయవంతం చేయాలని హితవు పలికారు. జిల్లా స్థాయి పోటీల కోసం మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారితో పాటు ప్రత్యేకంగా అథ్లెటిక్స్‌ (లాంగ్‌ జంప్‌, షాట్‌ ఫుట్‌), బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, హ్యాండ్‌ బాల్‌, స్విమ్మింగ్‌, కుస్తీ, బాక్సింగ్‌ అంశాల్లోను ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి పంపించాలని కలెక్టర్‌ సూచించారు. వీటిలో రెజ్లింగ్‌, బాక్సింగ్‌ పోటీలకు కేవలం పురుషులను మాత్రమే ఎంపిక చేయాలని, మిగతా అంశాలకు స్త్రీ, పురుష క్రీడాకారులను ఎంపిక చేయాలన్నారు.

ఈ నెల 22 నుండి 24 వ తేదీ వరకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించాల్సి ఉన్నందున, 18 వ తేదీ సాయంత్రం నాటికి మండలాల నుండి జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారుల జాబితాను అందించాలని కలెక్టర్‌ సూచించారు. పీ.డీలు, పీ.ఈ.టీల సహకారంతో క్రీడా పోటీల్లో అన్ని నియమ,నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలని, ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా సజావుగా ఈ క్రీడలు నిర్వహించాలని హితవు పలికారు. మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు, క్రీడా జట్లకు బహుమతులతో పాటు, పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు అందజేయాలని, క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి మండలానికి రూ. 15 వేలు చొప్పున నిధులు కేటాయించిందని తెలిపారు.

కాగా, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ జిల్లాలో పలు చోట్ల చక్కగా ఉండగా, మరికొన్ని చోట్ల అధ్వాన్న స్థితిలో కనిపిస్తున్నాయని కలెక్టర్‌ అన్నారు. మరో రెండు మాసాల్లో విరివిగా మొక్కలు నాటాల్సి ఉన్నందున నర్సరీల నిర్వహణను చక్కదిద్దుకోవాలని సూచించారు. ఏ ఒక్క గ్రామ పంచాయతీలోనూ ఇతర ప్రాంతాల నుండి మొక్కలు కొనే పరిస్థితి ఉత్పన్నం కాకూడదని, స్థానికంగానే నర్సరీలలో సరిపడా మొక్కలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నర్సరీల్లో మొలకెత్తని విత్తనాల స్థానంలో వెంటనే కొత్త మొక్కలు పెంచాలని, అన్ని రకాల మొక్కలు పెంచేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు.

హరితహారం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఈ విషయంలో అలసత్వానికి తావివ్వకూడదని హితవు పలికారు. ఎంపీడీఓలు, ఏ.పీ.ఓలు క్రమం తప్పకుండా తమ పరిధిలోని నర్సరీలను సందర్శిస్తూ నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి హామీ పనులను విరివిగా గుర్తిస్తూ, కూలీలకు పెద్ద ఎత్తున పనులను కల్పించాలని, కనీస వేతనాలు గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్‌, డీపీఓ జయసుధ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న, డీఆర్‌డీఏ ఏ.పీ.డీ సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »