కామారెడ్డి, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజకీయ పార్టీల ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల జాబితాలో తప్పులను సవరించడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోతే వారి నుంచి బూతు లేవల్ ఏజెంట్లు దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు.
ఒక ఓటర్ పేరు జాబితాలో రెండు చోట్ల ఉంటే ఒకటి తొలగించడానికి ఓటర్ నుంచి దరఖాస్తు స్వీకరించాలని చెప్పారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల నాయకులు డివిజన్ స్థాయిలో ఆర్డీవోకు ఫిర్యాదు చేసుకోవాలని పేర్కొన్నారు.
ముఖ్యమైన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోతే వారి పేర్లను బూతులేవల్ ఏజెంట్లు పరిశీలించి కొత్తగా దరఖాస్తులు చేయించాలని తెలిపారు. ఆన్లైన్లో ఓటర్ల జాబితాలో పేర్లను పరిశీలన చేసుకోవచ్చని చెప్పారు. సమావేశంలో ఎన్నికల పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.