కామారెడ్డి, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ధాన్యం కొనుగోలు, ట్యాబ్ ఎంట్రీ పై సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత పత్రాలతో రైతు వివరాలను ట్యాబ్ లో నమోదు చేయాలని తెలిపారు.
రైతులకు డబ్బులు తక్షణమే అందేవిధంగా చూడాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వారిగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, ట్యాబ్ లో ఎంట్రీ చేసిన ధాన్యం వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి, ట్యాబ్ ఎంట్రీకి వ్యత్యాసం లేకుండా చూడాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఎస్‌ఓ పద్మ, డిఎం సివిల్ సప్లై అభిషేక్ సింగ్, ఆర్డీవోలు శ్రీనివాస్ రెడ్డి, శీను, రాజా గౌడ్, వ్యవసాయ, రెవెన్యూ , సహకార శాఖల అధికారులు పాల్గొన్నారు.