ఎడపల్లి, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ సర్పంచ్ పొట్టోళ్ల సాయిలు, ఉపసర్పంచ్ వెల్మల విజయ్ కుమార్ నిజామాబాదు ఎంపీ అరవింద్ సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు పలువురు గ్రామ యువకులు, మైనార్టీ యువకులు బోధన్ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన వారికి ఎంపీ అరవింద్ కండువాలు వేసి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి సాధ్యమని భావించిన ప్రజలు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. దొరల పాలన అంటే ఎలా ఉంటుందో ఈ తరానికి ప్రత్యక్షంగా చూపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, కేసీఆర్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పేరుతో తన కుటుంబ సభ్యులకు వందల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. ఎనిమిది ఏళ్ల కేసిఆర్ పాలన దొరల పాలనను తలపించిందని, బీఆర్‌ఎస్ పార్టీతో విసుగెత్తిన ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసేందుకే బీజేపీ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా బిజెపి కార్యదర్శి మాసోజు సుధాకర్ చారి, ఎడపల్లి మండల అధ్యక్షులు మోపాల్ కమలాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు సురేష్ లు పాల్గొనగా గ్రామానికి చెందిన యువకులు కృష్ణ, కొండాయి ప్రవీణ్, మంగలి గంగాధర్, కొండాయి గంగాధర్, మైనారిటీ సభ్యులు యూసఫ్ వీరందరినీ పార్టీ కోసం సమయం ఇచ్చి పనిచేయాలని ఎంపీ తెలిపారు.
అంబంలో 20 మంది బీజేపీ లో చేరిక….
అంబం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు విజయ్ కుమార్ శుక్రవారం ఎంపీ అరవింద్ సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు విజయ్ కుమార్‌తో పాటు గ్రామానికి చెందిన 20 మంది యువకులకు ఎంపీ అరవింద్ బీజేపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గత 12 ఏండ్లుగా బీఆరెస్ పార్టీలో ఉంటూ ప్రత్యేక తెలంగాణా పోరాటంలో పాల్గొని అరెస్టులు సైతం అయ్యామని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లే వీడి బీజేపీలో చేరామన్నారు.