కామారెడ్డి, మే 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 17న పాలిటెక్నిక్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుందని తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇస్తారని చెప్పారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్ ఆర్ కె, సందీ పని, మంజీరా డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 2514 మంది పరీక్ష రాస్తున్నారని తెలిపారు. వీరిలో బాలికలు 1202, బాలురు 1312 మంది పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. విద్యార్థులు హాల్ టికెట్, హెచ్ బి పెన్సిల్, పెన్ను, ఎరేజర్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.
ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 11 గంటల తర్వాత ఒక నిమిషం అలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదని చెప్పారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, మద్నూర్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో పాలీసెట్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ కిష్టయ్య, సంయుక్త సమన్వయకర్త శంకరయ్య, చీఫ్ సూపర్డెంట్లు చంద్రకాంత్, మధుసూదన్ రెడ్డి, డాక్టర్ సురేష్ గౌడ్, సాయిబాబా, జిల్లా విద్యాధికారి రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.