Breaking News

నకిలీ విత్తనాల చెలామణిని ఉక్కుపాదంతో అణిచివేయాలి

నిజామాబాద్‌, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌ ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌ రెడ్డి సూచించారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. రాష్ట్ర డీ.జీ.పీ అంజనీకుమార్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు తదితరులతో కలిసి మంత్రి నిరంజన్‌ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.

వానాకాలం సాగుకు సంబంధించి సుమారు 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. అదే సమయంలో నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన గురుతర బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా ప్రైవేట్‌ కంపెనీల ద్వారా మార్కెట్లో చెలామణి అయ్యే అన్ని రకాల విత్తనాలను క్రమబద్దీకరించాలని ఆదేశించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనే పదం వినిపించకూడదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నందున ఎంతో అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని అన్నారు. దేశ వ్యాప్తంగా అవసరమైన విత్తనాలలో అరవై శాతం విత్తనాలను తెలంగాణ రాష్ట్రమే సమకూరుస్తుందని, ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాల బెడద లేకుండా పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్ర, గుజరాత్‌ తదితర ప్రాంతాల నుండి నకిలీ సీడ్‌ మన రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నకిలీ విత్తనాల తయారీదారులు, వాటి విక్రేతలను గుర్తిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

అలాగే, గడువు ముగిసిన విత్తనాలను, లైసెన్స్‌ లేకుండా విక్రయించే వాటిని, ఒక ప్రాంతంలో లైసెన్స్‌ కలిగి ఉండి, వేరే చోట విక్రయాలు జరిపే వారి పైనా చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే, స్టాక్‌ రిజిస్టర్‌, బిల్‌ బుక్‌ నిర్వహణ వంటి చిన్న చిన్న లోపాలను గుర్తించిన సమయాల్లో వాటిని సవరించుకోవాల్సిందిగా డీలర్లకు సూచించాలని, ఆ మేరకు మార్పు రాని పక్షంలో నిబంధనలను అనుసరిస్తూ చర్యలు చేపట్టాలన్నారు. కాగా, పోలీస్‌ శాఖ అధికారులతో కూడిన టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తూ, విరివిగా తనిఖీలు నిర్వహించాలని డీజీపీ అంజనీకుమార్‌ సూచించారు.

గతేడాది సమర్ధవంతంగా విధులు నిర్వర్తించి నకిలీ విత్తనాల బెడద లేకుండా కట్టడి చేశారని, ప్రస్తుతం కూడా అదే స్పూర్తితో పని చేయాలని అన్నారు. పదేపదే నకిలీ విత్తనాల దందాను నిర్వహించే వారిని గుర్తిస్తూ, అవసరమైతే పీ.డీ యాక్టు పెట్టాలని సూచించారు. నకిలీ విత్తనాల కేసులతో సంబంధం కలిగి ఉన్న పాత నేరస్థులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్‌, ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్‌ దాస్‌, ఏ.సీ.పీ నారాయణ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »