డిచ్‌పల్లి, మే 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, ఒకపక్క విసి అక్రమాలు, అవినీతి, విద్యార్థుల దగ్గర డబ్బులు ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే మరోవైపు పిహెచ్‌డి స్కాం జరిగిందని, దీనిపై కేవలం ఒక్క విద్యార్థి నాయకుడిపై విచారణ జరపడం సరికాదని తెలంగాణ విద్యార్థి పరిషత్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
2021 నుంచి 2023 వరకు ఎవరైతే పీహెచ్‌డి పట్టాలు పొందారో, వారందరిపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అనుచరులకు అర్హులు కాకపోయినా పిహెచ్‌డి పట్టాలు ఇవ్వడం సిగ్గుచేటని, రాష్ట్ర ప్రభుత్వం అండతో ఒకపక్క వీసి రవీందర్ గుప్తా తన ఇష్టారాజ్యంగా లక్షల రూపాయలు దోచుకుంటున్నారన్నారు.
ఓపెన్ డిగ్రీ చేసిన వారికి కూడా పీహెచ్‌డి పట్టాలు ఇవ్వడం సిగ్గుచేటని, ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి ఎవరైతే రెండు లక్షల నుంచి ఐదు లక్షల డబ్బులు ఇచ్చి పీహెచ్‌డి పట్టాలను తీసుకున్నారో వారిపై చర్యలు తీసుకొని, అర్హులు కానటువంటి వారికి కూడా పీహెచ్డీ పట్టాలు ఇచ్చి యూనివర్సిటీ పేరుని అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుందన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు అఖిల్, నగర నాయకులు దేవేందర్, ప్రశాంత్, కృష్ణ, సాయి తదితరులు ఉన్నారు.