నిజామాబాద్, మే 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రతి సంవత్సరం 6, 9 వ తరగతులలో ప్రవేశాల ప్రక్రియను నిర్వహిస్తుండగా, ప్రస్తుత 2023 – 24 విద్యా సంవత్సరంలో నూతనంగా 11వ తరగతిలో ప్రవేశాల కోసం జవహర్ నవోదయ విద్యాసమితి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ మేరకు గురువారం నిజాంసాగర్ లోని నవోదయ విద్యాలయం ఇంచార్జి ప్రిన్సిపల్ ఎస్.గణపతి నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి 11వ తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ గురించి జిల్లా పాలనాధికారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ, గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థిని, విద్యార్థులకు ఇది ఎంతో చక్కటి అవకాశం అన్నారు.
నాణ్యమైన విద్యను అందిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతిలో ప్రవేశాలు పొందే అవకాశాన్ని అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల నుండి 2022 – 2023 సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని, 01.06.2006 నుండి 31.07.2008 మధ్య జన్మించి ఉండాలని వివరించారు.
ఈ నెల 31 వ తేదీ లోపు వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. జూలై 22 న ప్రవేశ పరీక్ష ఉంటుందని, పదవ తరగతి స్థాయిలో మెంటల్ ఎబిలిటీ, ఆంగ్లం, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ విభాగంలో ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.