నిన్ను చూసి ఎన్నిరోజులైందో ?
నీ స్పర్శ లేక ఎన్నినెలలు దాటిందో?
నీకేం, ఎక్కడున్నా బానే ఉంటావ్,
తళతళా మిళమిళలతో, నవ్వకు
ఏం బాగు అది? చీకటిగదిలో బిక్కుబిక్కుమంటూ
ఒంటరిగా,
ఏసిలో ఉన్నా నీకు చెమటలేగా !
సరెలే, నీలాంటి సోపతితోనే నీకేం ధైర్యం వస్తది?
నలుగురితో ఉండాల
నలుగురిలో ఉండాల,
చెమట చేతులను తాకినపుడు
నీవు కడుపునింపే అన్నమైనావు,
కష్టాల జేబులలో దూరినపుడు
నీవు కండ్ల నిండా పండుగైనావు,
చదువులను గట్టెక్కించే దారివైనావు,
పెళ్ళిలను వెలిగించే దీపమైనావు,
అదంతా గతమే,
నీవు లేక ఏళ్ళే గడిచే,
ఏదో వలసవెళ్ళినట్లు-
ఐనా ఎప్పటికైనా నిన్ను చూస్తం లే అనుకునేటోళ్ళం,
నీతో దావతులుంటయని
కలగనేటోళ్ళం,
నిన్ననే తెల్సింది
ఇక నీక నీవు రావట
ఇక మాకు లేవట,
ఐనా నువ్వున్నపుడు మా
తెల్లమొహాలను ఎపుడు కానినావనీ,
ఎప్పుడు నల్లమొహాలతోనే నీ దోస్తానా?
ఇపుడు నువు పోతుంటే
వాళ్ళకె సెగ
మాకేమ్మున్నది ఇగ!
వీడుకోలు రెండువేల నోటా!
అల్విదా! నీకు మా టాటా!
కాసర్ల నరేశ్‌రావు
కవి, రచరుత, నిజామాబాద్.