నిజామాబాద్, మే 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిజామాబాద్‌లో గల కేర్ డిగ్రీ కళాశాలలో సాయమ్మ అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వైఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని హాజరు శాతం పెంచుతామని మాటల్లో చెబుతున్నా వాటికి తోడ్పాటును అందిస్తున్న విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం పెట్టిన కార్మికులకు మాత్రం ప్రభుత్వం కడుపు నింపటం లేదన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రోజుకు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల రేట్లు పెంచడం లేదని కోడిగుడ్డు సిలిండర్ ఇతర నిత్యవసర వస్తువుల భారం కార్మికులపై పడుతుందని అప్పులు చేసి కార్మికులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని అన్నారు కానీ ప్రభుత్వం వారికి రావలసిన బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం సరికాదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా కార్మికులకు 3000 రూపాయల వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆరు నెలలవుతున్న నేటికీ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.కావున ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు.
యూనియన్ జిల్లా కార్యదర్శి చక్రపాణి మాట్లాడుతూ విద్యార్థులకు ఇచ్చే గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని, గ్యాస్ సిలిండర్ ప్రభుత్వమే ఇవ్వాలని, ప్రస్తుత ధరలకు అనుగుణంగా వంట సామాగ్రి ధరలను పెంచాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు పిఎఫ్, ఈఎస్‌ఐ, పని భద్రత కల్పించాలని ప్రతినెల మొదటి వారంలో బిల్లులు వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో ఏఐటీయూసీ నిర్వహించే కార్యక్రమాల్లో కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నర్సింగరావు తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు పెద్దమ్మి, నాగలక్ష్మి, గంగమణి, సుధాకర్, సాయమ్మ, 34 మండలాల నుండి అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.