ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

నిజామాబాద్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషిచేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

దళితుల అభ్యున్నతికి దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపధ్యంలో సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవడం ద్వారా వారిని గౌరవించుకోవడంతో పాటు మహనీయుల స్పూర్తితో సమాజహితం కోసం ముందుకు సాగేందుకు ఈ వేడుకలు దోహదపడుతున్నాయని అభిప్రాయపడ్డారు.

భాగ్య రెడ్డి వర్మ 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని ఆయన సేవలను కొనియాడారు. దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని వక్తలు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి శశికళ, జెడ్పి సీఈఓ గోవింద్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డీ రమేష్‌, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్‌, డీడబ్ల్యుఓ రసూల్‌ బీ, ట్రాన్స్కో ఎస్‌.ఈ రవీందర్‌, డీఈఓ దుర్గాప్రసాద్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »