నిజామాబాద్, మే 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా అధికారులు అంకిత భావంతో పని చేయాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం తరలింపు విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. ప్రధానంగా రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను వెంటదివెంట అన్ లోడ్ చేసుకునేలా చూడాలని, ఏ ఒక్క రైస్ మిల్లు వద్ద కూడా జాప్యం జరుగకుండా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం సేకరణ పురోగతిని సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, వాటి తరలింపు తదితర వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 70 శాతం ధాన్యం సేకరణ పూర్తయ్యిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంత్రి దృష్టికి తెచ్చారు.
గుండారంలోని జై గణేష్ ప్యాడీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, శ్రీకృష్ణ ఆగ్రో ఇండస్ట్రీస్‌తో పాటు పార్వతి రైస్ మిల్, ఆర్.కె మోడర్న్ రైస్ మిల్, సిద్ధిరామేశ్వర రైస్ మిల్, శ్రీ రామ మోడర్న్ తదితర రైస్ మిల్లుల వద్ద 48 గంటలకు పైగా ధాన్యం అన్ లోడిరగ్ జరుగని వాహనాలు ఒకింత ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని గుర్తించిన మంత్రి వేముల, సంబంధిత క్లస్టర్ల పరిధిలో పర్యవేక్షణ విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ (డీటీ)లను సమీక్షా సమావేశం నుండే ఫోన్ ద్వారా సంప్రదించి అన్‌లోడిరగ్లో జాప్యానికి గల కారణాలను ఆరా తీశారు. రెండు, మూడు రోజుల పాటు ధాన్యం అన్ లోడిరగ్ నిలిచిపోతే మీరేం చేస్తున్నారంటూ మంత్రి మందలించారు.
అధికారులు, సిబ్బంది అందరూ ధాన్యం సేకరణ ప్రక్రియలో కష్టపడి పని చేస్తున్నారని, అయితే రైతులకు చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా వారికి సంతృప్తికర స్థాయిలో సేవలందించేలా మరింత శ్రద్దాసక్తులతో పని చేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. మంత్రి ఫోన్లో సంప్రదించిన సమయంలో ముగ్గురు డీ.టీలు మధ్యాన్నం భోజనం కోసం ఇంటికి వచ్చామని తెలుపగా, క్షేత్రస్ధాయిలోనే ఉంటూ, ఎప్పటికప్పుడు ధాన్యం అన్ లోడిరగ్ జరిగేలా సమర్ధవంతంగా పర్యవేక్షణ చేయాలని వారికి సూచించారు.
ఇళ్ల నుండి లంచ్ బాక్సులు తెచ్చుకుని పర్యవేక్షక బాధ్యతలు కలిగి ఉన్న ప్రదేశాల్లోనే మధ్యాహ్న భోజనం చేయాలని, ఇది ఆరోగ్య పరిరక్షణకు కూడా దోహదపడుతుందని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ లోడిరగ్ ప్రక్రియలో జాప్యం జరగడానికి వీలులేదని, అవసరమైన చోట హమాలీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. ఇప్పటికే ధాన్యం సేకరణ పూర్తయిన బాన్సువాడ, బోధన్ ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల పరిధిలో పని చేసిన హమాలీల సేవలను రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడిరగ్ కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పని చేయాలని, ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై వేటు వేసేందుకు వెనుకాడబోమని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకునేందుకు గాను ఎక్కువ మొత్తంలో గోడౌన్లను గుర్తించాలని, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో వాహనాలు సమకూర్చేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, డీ.ఎస్.ఓ చంద్రప్రకాష్, డీఆర్డీఓ చందర్, మెప్మా పీ.డీ రాములు, సివిల్ సప్ప్లైస్ జిల్లా మేనేజర్ జగదీశ్, డీసిఓ సింహాచలం, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, వ్యవసాయ, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.