ధాన్యం కొనుగోళ్లను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి

నిజామాబాద్‌, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా చివరి దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలోనూ క్షేత్ర స్థాయిలో ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ జిల్లా యంత్రాంగాలకు సూచించారు. బుధవారం ఆయన సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రవీందర్‌ సింగ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.అనిల్‌ కుమార్‌లతో కలిసి జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు.

ధాన్యం సేకరణ, రైస్‌ మిల్లులకు వాటి తరలింపు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ సీజన్‌ లో ముందస్తుగానే ఏప్రిల్‌ 10 వ తేదీ నుండే ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి గుర్తు చేశారు. గత చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గతేడాది 28.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈ ఏడాది ఇప్పటికే పది లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు అదనంగా 38.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు.

నాలుగున్నర లక్షల మంది రైతుల నుండి ధాన్యం సేకరించగా, ఈసారి 4.55 లక్షల మంది రైతుల వద్ద ధాన్యం సేకరించామని తెలిపారు. ధాన్యం దిగుబడులకు అనుగుణంగా అదనంగా 400 కొనుగోలు కేంద్రాలను సైతం అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ రైతులకు ఊరటనందించిందని అన్నారు.

21 శాతం తేమ కలిగిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామన్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల పాలకవర్గాల తోడ్పాటుతోనే ఇంత పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలను కొనుగోలు చేయడం సాధ్యపడిరదని మంత్రి గంగుల కమలాకర్‌ ఈ సందర్భంగా వారిని అభినందించారు. అయితే, ప్రస్తుతం మరో పక్షం రోజుల పాటు మరింత శ్రద్దాసక్తులతో పనిచేస్తూ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

రైతుల నుండి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తూ, వాటిని భద్రపరిచేందుకు వీలుగా అవసరమైన చోట గిడ్డంగులను గుర్తించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యానికి తరుగు తీయకుండా రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. ధాన్యం రవాణాకు ఆటంకాలు తలెత్తకుండా అదనపు వాహనాలను సమకూర్చుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 5 . 38 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, మరో 90 వేల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. సుమారు ఐదు వేల మెట్రిక్‌ టన్నుల ముడి బియ్యం సరఫరా చేసేందుకు జిల్లాలోని రైస్‌ మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఎఫ్‌సీఐ అనుమతించడం లేదన్నారు. ఈ విషయమై మంత్రి స్పందిస్తూ, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిర్దేశిత లక్ష్యం మేరకు రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ను అందించేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎస్‌ఓ చంద్రప్రకాష్‌, డీసీఓ సింహాచలం, సివిల్‌ సప్లైస్‌ డీ.ఎం జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

హామీలు వెంటనే అమలుపర్చాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »