కామారెడ్డి, మే 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా మాట్లాడారు. జిల్లా నుంచి 191 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు.
గ్రామీణ క్రీడాకారులలో నెలకొన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్ క్రీడలను రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పారు. గ్రామీణ క్రీడాకారులు , మండల స్థాయిలో ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులకు శిక్షణ పొందే వీలు కల్పించారని తెలిపారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో వివిధ క్రీడల నైపుణ్యాలు ప్రదర్శించి ప్రథమ బహుమతులు పొందాలని ఆకాంక్షించారు.
తల్లిదండ్రులకు, జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ఈనెల 15 నుంచి 17 వరకు మండల స్థాయి క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. ఈనెల 22 నుంచి 24 వరకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన జట్లకు బహుమతులను రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ, డిఇఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, ఏస్ జి ఎఫ్ కార్యదర్శి రసూల్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.