పేదల ముంగిట్లోకి కార్పొరేట్‌ వైద్యం

నిజామాబాద్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజలకు సైతం కార్పొరేట్‌ తరహా వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తేవాలనే మానవీయ కోణంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రూ. 2 కోట్ల 14 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సీ.టీ స్కాన్‌ యంత్రం, రూ. 30 లక్షలతో ఏర్పాటు చేసిన ఐ ఫాకో మిషన్‌, రూ. 7 లక్షలతో నెలకొల్పిన 500 ఎం.ఏ ఎక్స్‌-రే యూనిట్‌ లను, మానసిక చికిత్సా విభాగాన్ని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఆదివారం జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌ తదితరులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు భారంగా మారిన సీ.టీ స్కాన్‌ సేవలను జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో ఉచితంగా అందుబాటులోకి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందన్నారు. సీ.టీ స్కాన్‌ పరీక్షలు బయట చేయించుకునేందుకు పేద కుటుంబాల వారు ఆర్ధిక ఇబ్బందులు పడాల్సివచ్చేదని, ప్రస్తుతం జీజీహెచ్‌ లో ఉచితంగా చేయబడుతాయని అన్నారు.

ఒక్కోటి 13 వేల రూపాయల విలువ చేసే 400 డిజిటల్‌ బీ.పీ మెషిన్‌ లను సైతం జిల్లాకు కేటాయించారని, వీటిని ఏ.ఎన్‌.ఎంలకు కేటాయిస్తూ వారి ద్వారా గ్రామగ్రామాన ప్రజలకు సేవలందించడం జరుగుతుందన్నారు. ఐ ఫాకో మెషిన్‌ ద్వారా నేత్ర పరీక్షలకు సంబంధించి కూడా మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. జీజీహెచ్‌ కు కోరిన వెంటనే అధునాతన యంత్ర పరికరాలను కేటాయించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్‌ రావుకు ఈ సందర్భంగా జిల్లా ప్రజల తరఫున మంత్రి ప్రశాంత్‌ రెడ్డి కృతజ్ఞతలు ప్రకటించారు.

కార్యక్రమంలో నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి,రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌ పర్సన్‌ ఆకుల లలిత, డీఎంహెచ్‌ఓ డా.సుదర్శనం, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.ప్రతిమ రాజ్‌, మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డా.ఇందిరా, మానసిక వైద్య నిపుణులు డా.విశాల్‌,స్థానిక కార్పొరేటర్‌ భైఖాన్‌ సుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »