కామారెడ్డి, మే 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు.
సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌లతో కలిసి వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడారు. జూన్ 2 నుంచి జూన్ 22 వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకలలో ప్రగతి చాటేలా విధంగా ఘనంగా నిర్వహించాలనిఅన్నారు. రైతు దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ నిర్వహణ పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. రైతు దినోత్సవం నాడు జిల్లాలో ఉన్న రైతు వేదికలో వేడుకలు జరగాలని, ప్రతి గ్రామం నుంచి రైతులను డప్పులుతో ఘనంగా పండుగ వాతావరణంలో రైతు వేదికలకు తీసుకొని రావాలని, అక్కడ ప్రభుత్వం ప్రతి రైతుకు కల్పించిన సౌకర్యాలు, అందించిన సహాయంపై తెలియజేయాలని తెలిపారు. భోజన ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. జూన్ 8న ఊరురా చెరువుల పండుగ సందర్భంగా గ్రామాల్లో ఉన్న పెద్ద చెరువు వద్ద బతుకమ్మ, బోనాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కట్ట మైసమ్మ పూజ, భోజనాలు పకడ్బందీగా చేయాలని తెలిపారు.
రైతు దినోత్సవం,ఊరురా చెరువుల పండుగ నిర్వహణకు జిల్లాలో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు కావద్దని సీఎస్ అన్నారు. విద్యుత్ రంగంలో గత పరిస్థితి, నేడు సాధించిన ప్రగతి తెలియజేస్తూ నాడు- నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, పోలీస్ ఆధ్వర్యంలో సురక్షా దివస్, తెలంగాణరన్ నిర్వహించాలని అన్నారు.
పారిశ్రామిక ప్రగతి, సాగునీటి రంగంలో సాధించిన విజయాలు తెలియజేయాలని అన్నారు. జూన్ 9న సంక్షేమ సంబురాలు సందర్బంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండవ విడత గొర్రెల పంపిణీ, అవకాశం ఉన్న చోట ఇంటి పట్టాల పంపిణీ, బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం ప్రారంభించాలని అన్నారు. బీసి కుల వృత్తుల ఆర్థిక సహాయంపై క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం మార్గదర్శకాలు అందిస్తామని, దాని ప్రకారం లబ్దిదారులను ఎంపిక చేసి జూన్ 9న ప్రారంభించాలని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు, మండలాలు, గ్రామాల వివరాలు తెలియజేయాలని పేర్కొన్నారు. మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో సాధించిన ప్రగతి, కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, అందిస్తున్న అదనపు సేవలను వివరించాలని, వైద్య, ఆరోగ్య శాఖ దినోత్సవం నాడు కేసిఆర్ న్యుట్రిషన్ కిట్ పంపిణీ చేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సాధించిన విజయాలు ఘనంగా చాటాలని సీఎస్ అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల సందర్బంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయాలని, సఫాయిన్న సలాం అన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు.
మిషన్ భగీరథ క్రింద ఇంటింటికి త్రాగునీటి సరఫరా, గిరిజనోత్సవం, పెరిగిన పచ్చదనం, విద్యాశాఖలో సాధించిన ప్రగతి పక్కాగా తెలియజేయాలని, ఆధ్యాత్మిక రంగంలో సాధించిన ప్రగతి , అమరుల సంస్కరణ కార్యక్రమాలు పకడ్బందీగా జరగాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు ఎస్పీ అన్యోన్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.