హైదరాబాద్, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఈనెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని తెలిపారు.
ఈదురుగాలులు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అంచనా వేశారు. తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండలతో పాటు వానలు కూడా దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో భానుడు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో వర్షాలు కురుస్తుండటంతో చల్లని వాతావరణం ఏర్పడుతుంది. దీంతో ఎండ వేడి నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తోంది.
మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్వల్ప వర్షాలు కరిశాయి. దుండిగల్‌లో 3.8 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్‌లో 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం వరంగల్‌లో వర్షం కురిసింది. వర్షంతో వరంగల్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అలాగే పలు పట్టణాల్లో కూడా చిరు జల్లులు కురుస్తున్నాయి. ఒకవైపు వర్షాలు పడుతుండగా.. మరోవైపు ఎండల తీవ్రత పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం అత్యధికంగా ఖమ్మంలో 43.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
దాదాపు అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. భానుడి తీవ్రతతో పాటు వడగాల్పులు, ఉక్కబోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఎండలు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. జూన్ వరకు ఎండలు ఉంటాయని, అలాగే వర్షాలు కూడా పడతాయని అంచనా వేస్తున్నారు. అటు ఏపీలో కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వానలు పడుతుండగా.. నేడు పలు జిల్లాలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది.