బాల్కొండ, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు దినోత్సవ సంబరాలతో పల్లెలు పులకించిపోయాయి. సేద్యమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో భాగస్వాములయ్యారు. ఎవరికివారు, ఎక్కడికక్కడ స్వచ్చందంగా తరలివచ్చి, అందంగా అలంకరించిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై రైతు వేదికల వరకు ర్యాలీగా చేరుకున్నారు. విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలు, రంగవల్లులతో అందంగా ముస్తాబు చేసిన రైతు వేదికలు దశాబ్ది ఉత్సవ శోభతో ఉట్టిపడ్డాయి.
బాల్కొండ నియోజకవర్గంలోని వన్నెల్ (బి) గ్రామంలో జరిగిన రైతు దినోత్సవ వేడుకలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతులతో కలిసి ఎడ్లబండిపై రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, సాగు రంగానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, అమలు చేస్తున్నసంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేశారు. సమైక్య రాష్ట్రంలో ఎదురైన వివక్ష, అడుగడుగునా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు.
ఉద్యమ నేతగా 2001లో కేసీఆర్ నాయకత్వంలో మలిదశ పోరాటంతో సాధించుకున్నప్రత్యేక తెలంగాణ స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్లలో వ్యవసాయం, తదితర రంగాల్లో సాధించిన ప్రగతి గురించి రైతులకు తెలియజేశారు. రైతు బంధు, రైతు బీమా ద్వారా లబ్ది పొందిన రైతులచే వారి అనుభవాలను వివరింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో కనీసం తెలంగాణ అనే పదం కూడా పలికేందుకు సాహసించని పరిస్థితి నెలకొని ఉండేదన్నారు. చెరువులలో నీళ్లు లేక, కరెంటు కష్టాలతో తెలంగాణ రైతు నోట్లో మట్టి కొట్టారని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. తరచూ బోరు మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటి సమస్యలతో ఎల్లవేళలా రైతులు ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వచ్చేదని గుర్తు చేశారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను చూసి సహించలేక, స్వరాష్ట్రం సాధించుకుంటేనే ఈ బాధలు దూరమవుతాయని భావించిన ఉద్యమ నేత కెసిఆర్ తన పదవులను తృణప్రాయంగా త్యజించి 2001లో తెలంగాణ జెండాను ఎత్తుకున్నారని అన్నారు. మలి విడత ఉద్యమంలో సబ్బండ వర్ణాల సహకారంతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని రంగాలు గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు.
రైతాంగ ప్రయోజనాల కోసం తెలంగాణలో తమ ప్రభుత్వం నిర్మించినన్ని సాగునీటి పథకాలు, చెక్ డ్యాములు, వరద కాలువలు మరే ఇతర రాష్ట్రాల్లో లేవని స్పష్టం చేశారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తూ, రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తూ, అన్నదాతలు పండిరచిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
ఫలితంగా రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. 2014లో తెలంగాణలో ఒక కోటి 21 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యేవని, ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయానికి ఇతోధికంగా మేలు చేకూరుస్తుండడంతో రెండు కోట్ల 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. వరి పంటనే తీసుకుంటే 34 లక్షల ఎకరాల నుండి కోటి 20 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. గత యాసంగిలో దేశం మొత్తం మీద 94 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే, అందులో 54 లక్షల ఎకరాల్లో తెలంగాణ రైతాంగం వరి సాగు చేశారని వివరించారు.
తాను ప్రతినిధ్యం వహిస్తున్న ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 2014తో పోలిస్తే 40,000 ఎకరాలలో పంట సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రైతుబంధు పథకం కింద బాల్కొండ సెగ్మెంట్ పరిధిలోని రైతాంగానికి 611 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో అందించామని, ఉచిత విద్యుత్ కోసం రూ. 1100 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. రైతుల నుండి 430 కోట్ల రూపాయల విలువ చేసే పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా చూసినా, 2014లో 4 లక్షల 14 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యేవని, ప్రస్తుతం ఐదు లక్షల 40 వేల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారని మంత్రి వేముల తెలిపారు.
జిల్లాలో వరి సాగు లక్షా 93 వేల ఎకరాల నుంచి ఏకంగా నాలుగు లక్షల 18 వేల ఎకరాలకు పెరిగిందన్నారు. సేద్యానికి ఉచిత విద్యుత్ అందించడం ద్వారా ప్రభుత్వం 3719 కోట్ల రూపాయల బిల్లు మొత్తాలను చెల్లించిందన్నారు. నాడు జిల్లాలో కేవలం 26 మంది వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 106 కు పెరిగిందని గుర్తు చేశారు. రైతుబంధు కింద జిల్లా వ్యాప్తంగా 2003 కోట్ల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించామన్నారు. గతంతో పోలిస్తే ప్రత్యేక రాష్ట్రంలో ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల ద్వారా తమ ప్రభుత్వం ఐదు రెట్లు అధికంగా పంటలను కొనుగోలు చేస్తోందన్నారు. వన్నెల్(బి) క్లస్టర్ పరిధిలోని కేవలం ఐదు గ్రామాలలోనే రైతు బంధు కింద రైతులకు రూ. 23 కోట్ల మేర లబ్ధి చేకూర్చడం జరిగిందని మంత్రి తెలిపారు.
రైతు బీమా కింద బాధిత కుటుంబాలకు కోటి 65 లక్షల రూపాయాల పరిహారాన్ని అందించామని అన్నారు. ఉచిత విద్యుత్ కోసం 9.15 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తోందని వివరించారు. ప్రకృతి వైపరీత్యాలతో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని సైతం పూర్తిస్థాయి మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆడుకుంటోందని, పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందిస్తోందని గుర్తు చేశారు. ఇలా సాగు రంగానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో ఈ ప్రాంత రైతుల గౌరవం ఎంతగానో అనుమడిరచిందని అన్నారు.
యావత్ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నలు వాస్తవ పరిస్థితులను గమనించాలని మంత్రి కోరారు. అన్ని రకాలుగా మేలు చేకూరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ, అందరికీ ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు. ఏమాత్రం ఆదమరిచినా, మళ్లీ 2014 నాటి పాత పరిస్థితులే పునరావృతం అయ్యే ప్రమాదం ఉంటుందని అన్నారు. తెలంగాణేతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు కింద ఎకరాకు పదివేల రూపాయలు, రైతు బీమా కింద బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందించడం, కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పంటను మద్దతు ధరకు సేకరించడం వంటివి అమలు కావడం లేదన్నారు.
అందుకే బీహార్ తదితర రాష్ట్రాల రైతులు వారు పండిరచిన ధాన్యాన్ని సొంత ఖర్చులతో లారీలలో ఇక్కడికి తీసుకువచ్చి కారుచౌక ధరకే విక్రయిస్తున్నారని అన్నారు. అనంతరం మంత్రి రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, నియోజకవర్గ నోడల్ అధికారి సింహాచలం, రైతు ప్రతినిధులు కోటపాటి నర్సింహం నాయుడు, డాక్టర్ మధుశేఖర్, రైతు బంధు ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వన్నెల్(బి) క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులు పాల్గొన్నారు.