వెలుగులీనిన ‘విద్యుత్‌ విజయోత్సవ’ సభలు

నిజామాబాద్‌, జూన్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన విద్యుత్‌ ప్రగతి సభలు వెలుగుల సౌరభాలను వెదజల్లాయి. 2014 కు పూర్వం నెలకొని ఉన్న కారు చీకట్లను చీల్చుకుని, నేడు వాడవాడలా నిరంతర కాంతి రేఖలతో దేదీప్యమానంగా వెలుగులీనుతున్న ఉజ్వల తెలంగాణను ఆవిష్కరింపజేశాయి. రాష్ట్ర ప్రగతిలో అత్యంత కీలకమైన విద్యుత్‌ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సంస్కరణలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సాధించిన విజయాలను విద్యుత్‌ ప్రగతి సభల ద్వారా వక్తలు విశదపర్చారు.

సేద్యానికి ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించడమే కాకుండా, నాయి బ్రాహ్మణులు, రజకులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులు తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చుతూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. శాసనసభా నియోజకవర్గాల వారీగా నిర్వహించిన విద్యుత్‌ ప్రగతి సభల్లో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొనగా, పెద్ద సంఖ్యలో రైతులు, లబ్ధిదారులు స్వచ్చందంగా తరలివచ్చారు.

మోర్తాడ్‌ మండలంలోని లలితా గార్డెన్స్‌ లో నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ విద్యుత్‌ ప్రగతి సభకు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసారు. జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం, స్వరాష్ట్రంలో సాధించిన విద్యుత్‌ ప్రగతిని వివరిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అతి తక్కువ వ్యవధిలో నూతనంగా నిర్మించిన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, సబ్‌ స్టేషన్లు అనితర సాధ్యమైన ప్రగతిని సాధించిన వైనాన్ని డాక్యుమెంటరీ ద్వారా తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్లలో విద్యుత్‌ రంగంలో సాధించిన పురోగతి అనన్య సామాన్యమైనదని అన్నారు. దీనికై ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంస్కరణలు, విద్యుత్‌ ఉద్యోగులు చేసిన కృషితోనే ఇది సాధ్యమయ్యిందని కలెక్టర్‌ ప్రశంసించారు. ప్రమాదాలకు ఆస్కారం కలిగిన రంగంలో పనిచేస్తూ, అన్ని వర్గాల వారికి 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ ను అందించేందుకు ఆ శాఖ ఉద్యోగులు అహరహం శ్రమిస్తున్నారని, వారి కృషిని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.

మెరుగైన రోడ్లు, రవాణా, నీటి వసతి, శాంతిభద్రతలు వంటి మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్యుత్‌ ను అందించే వ్యవస్థ ఉన్నప్పుడే ఆయా ప్రాంతాలు అన్ని రంగాల్లో త్వరితగతిన అభివృద్ధిని సాధిస్తాయని అన్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రగతి తార్కాణంగా నిలుస్తోందన్నారు. 2014లో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 7778 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 18 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులో ఉందని వివరించారు. ఒక్క బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉచిత విద్యుత్‌ తో పాటు వివిధ వర్గాలకు సబ్సిడీల రూపంలో ప్రభుత్వం సంవత్సరానికి 400 కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని తెలిపారు.

46 వేల వ్యవసాయ విద్యుత్‌ పంపుసెట్లకు ఉచిత కరెంటు ద్వారా ప్రతి యేటా రెండు వందల కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం భరిస్తోందన్నారు. 2018 జనవరి 26 నుండి సాగు రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ను అమలులోకి తెచ్చిన తర్వాత సాగు విస్తీర్ణం వృద్ధి చెంది వ్యవసాయ రంగానికి కరెంటు వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. అయినప్పటికీ తదనగుణంగా ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పాదకతను పెంచుతూ, సేద్యానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ కూడా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున పవర్‌ ప్రాజెక్టులు, ట్రాన్స్మిషన్‌ సెంటర్లు, సబ్‌ స్టేషన్‌ లను విరివిగా నిర్మిస్తోందని తెలిపారు.

అంతర్జాతీయ స్థాయి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అతి తక్కువ విస్తీర్ణంలో, స్వల్ప వ్యవధిలోనే విద్యుత్‌ ఉప కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారని అన్నారు. నాయి బ్రాహ్మణులు, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వారికి, రజకులకు ఉచిత విద్యుత్‌ సమకూరుస్తూ, గృహ అవసరాలకు కూడా పరిమిత యూనిట్ల వరకు సబ్సిడీపై ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా చేస్తోందని కలెక్టర్‌ తెలిపారు. విద్యుత్‌ ఆవశ్యకతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ అవసరమైన మేరకే పొదుపుగా వినియోగించాలని కలెక్టర్‌ హితవు పలికారు.

వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ట్రాన్స్‌ కో ఎస్‌.ఈ రవీందర్‌, నియోజకవర్గ నోడల్‌ అధికారి సింహాచలం, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమన్వయ సమితి బాధ్యులు, రైతులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »