బాన్సువాడ, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్టీ కొరకు కష్టపడి పనిచేసే నాయకులకు కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజు అన్నారు. సోమవారం కోటగిరి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గత సంవత్సరం మృతి చెందడంతో పార్టీ ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు కాసుల బాలరాజ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని, కావున నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేయస్సు కోసం కష్టపడి పని చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు పార్టీ బీమా కల్పించడం ద్వారా ప్రమాదవశాత్తు మరణిస్తే పార్టీ ద్వారా రెండు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీతో పాటు, కొనుగోలు కేంద్రాల ద్వారా వారి ధాన్యానికి 2500 రూపాయలు చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, మండల అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, పొతంగల్ మండల అధ్యక్షుడు మాజీ జెడ్పిటిసి పుప్పల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎంపీటీసీ మనోహర్, హనుమంతు, అయ్యుబ్ లక్ష్మణ్, అరుణ్, కుమార్,భూమయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.