జగిత్యాల, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి తొలగించవద్దని గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ వలసలపై అవగాహన, చైతన్య కార్యక్రమంలో భాగంగా బుధవారం గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో గల్ఫ్ కార్మిక కుటుంబాలతో గల్ఫ్ జెఏసి బృందం సమావేశమైంది.
గల్ఫ్‌కు వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకం వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాలని, గల్ఫ్ కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్‌లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత పథకం ప్రవేశ పెట్టాలన్నారు. అన్ని విద్యా సంస్థలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.
ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణం వంటి పథకాలను వర్తింపజేయాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి కోరారు. కార్యక్రమంలో దమ్మన్నపేట గ్రామ సర్పంచ్ మిల్కూరి అనసూయ చంద్రయ్య, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు తాడూరి శ్రీనివాస్, మ్యాడవరం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.