హైదరాబాద్, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 5, తెలంగాణకు 12 కొత్త కాలేజీలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో మొదలవుతాయని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తెలంగాణలో..
తెలంగాణలోని మేడ్చల్, వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, అసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, జనగాం, హైదరాబాద్‌లలో కొత్త కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది. మేడ్చల్-మల్కాజిగిరిలో అరుందతి ట్రస్ట్, మేడ్చల్‌లో సీఎంఆర్ ట్రస్ట్, వరంగల్‌లో కొలంబో ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో వైద్యకళాశాలలు ఏర్పాటు కానున్నాయి. మిగిలిని అన్ని కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.