నిజామాబాద్, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అనుబంధం ఆధ్వర్యంలో ఈనెల 5,6,7 తేదీలలో ధర్నా చౌక్ లో మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మూడు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని గతంలో ఎన్నోసార్లు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకపోవడంతో శుక్రవారం జిజి కళాశాల నుండి ర్యాలీగా చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం సందర్భంగా ప్రధాన గేటు ముందే కూర్చుని ధర్నా, నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్.బాలరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని,చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు ప్రతినెల వేతనం ఇచ్చినట్టుగానే విద్యార్థులకు భోజనం పెట్టే మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఎందుకు ప్రతినెల చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి వంట పాత్రలోనే నిర్వాహకులు భోజనాలు వండుతున్నారని వంట పాత్రలు పాడైపోయినాయని వాటి అడుగులు పోయి బియ్యం వండితే అన్నం మాడిపోతున్నదని అన్నారు
ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చేటటువంటి ప్రజలకు వేల రూపాయలు ఖర్చుపెట్టి భోజనాలు పెట్టే ప్రభుత్వ పెద్దలు భావి భారత పౌరులకు ఒక్క రోజుకు ఐదు రూపాయలు మాత్రమే కేటాయించడం ఎంతవరకు సబబు కాదని ఈ సందర్భంగా ప్రశ్నించారు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల పిల్లలు చదువుకునే పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు అందించాల్సిన మధ్యాహ్న భోజన కార్మికులకు కేవలం నెలకు 3000 రూపాయలు చెల్లిస్తామని తెలిపినప్పటికీ ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరమని గత విద్యా సంవత్సరంలో గుడ్డు మరియు కిరాణా వస్తువుల పెండిరగ్ బిల్లు 8 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని, జూన్లో ప్రారంభం కానున్న స్కూల్‌లలో వంట రూమ్ల పైకప్పులను నిర్మించి బియ్యం, పప్పులు పాడు కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ప్రభుత్వంపై ఉన్నదని తెలియజేశారు.
చలో కలెక్టరేట్ ముట్టడి నిర్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఇప్పటికైనా కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి.నర్సింగరావు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.చక్రపాణి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.సాయమ్మలు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు గంగాధర్, స్రవంతి, గంగమణి, సత్యనారాయణ, లలిత, లావణ్య, లక్ష్మీ, జిల్లా వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.