కామారెడ్డి, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 14 నుంచి 22 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. జూన్ 12 నుంచి 19 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి5:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎలక్ట్రానిక్ వస్తువులకు పరీక్ష కేంద్రాల అనుమతి లేదని సూచించారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యుత్తు పోకుండా చూడాలన్నారు. పరీక్షల కోసం పగడ్బందీగా ఏర్పాట్లను పూర్తిచేయాలని పేర్కొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాధికారి రాజు, ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, అధికారులు పాల్గొన్నారు.