సాహితీ సౌరభాలను గుభాళించిన దశాబ్ది వేడుక

నిజామాబాద్‌, జూన్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా జరిగింది. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని ఆవిష్కరింపజేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌ సాహిత్య సౌరభాల గుభాళింపులకు వేదిక అయ్యింది.

ముందుగా ఖిల్లా జైలులోని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మహాకవి డాక్టర్‌ దాశరథి కృష్ణమాచార్యులు స్మారక భవనంలో మహాకవి దాశరథి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి సాహిత్య దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్‌, ప్రముఖ కవులు త్రివేణి, నరాల సుధాకర్‌, పీ.వీ.చందన్‌ రావు తదితరులు సాహిత్య దినోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు.

న్యూ అంబేడ్కర్‌ భవన్‌ లో జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజ్వలనతో కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. జెడ్పి చైర్మన్‌ సూచన మేరకు ములుగు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ ఆకస్మిక మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ, కొద్దిసేపు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన సాహితీవేత్తలు తమ సందర్భోచిత కవితా వచనాలతో ఈ కార్యక్రమానికి వన్నెలద్దారు. ఒకరికొకరు దీటుగా అక్షర విన్యాసాలు, పదబంధాలను ప్రయోగిస్తూ పద్య, వచన కవిత్వాలతో సాహిత్యాభిమానుల మన్ననలు అందుకున్నారు.

ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన కవి సమ్మేళనం మధ్యాహ్నం 3.30 గంటలకు వరకు కొనసాగగా, సాయంత్రం ముషాయిరా జరిగింది. కవుల కవితా రaరి అలుపెరుగని ప్రవాహంలా కొనసాగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యాన్ని, ఉద్యమ కాలం నాటి పరిస్థితులు, తెలంగాణ అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ, వివిధ రంగాలలో తెలంగాణ సాధించిన అద్వితీయ ప్రగతి గురించి తమ కవితల ద్వారా హృద్యంగా ఆవిష్కరించారు.

కవి సమ్మేళనం కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ అందరిని అలరింపజేసింది. తెలంగాణ ప్రాశస్త్యం, ఉద్యమ ప్రస్థానంలో నిజామాబాద్‌ గడ్డ పోషించిన పాత్ర, సాహితీ లోకంలో ఈ ప్రాంతానికి గల ప్రత్యేకత గురించి కవులు తమదైన శైలిలో కవితాత్మకత రూపంలో అభివర్ణించారు. ప్రస్తుత సమాజంలో సాహితీ రంగం పోషిస్తున్న పాత్ర గురించి విడమరచి చెప్పారు.

ఈ సందర్బంగా జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు మాట్లాడుతూ, కట్టి కంటే కలం ఎంతో గొప్పదని కవులు తమ రచనల ద్వారా అనేక సందర్భాల్లో నిరూపిస్తున్నారని అన్నారు. నాడు మహాకవి దాశరథిని నిజామాబాద్‌ లోని ఖిల్లా జైలులో నిర్బంధించిన సమయంలో ఆయన జైలు గోడలపై బొగ్గుతో రాసిన నా తెలంగాణ కోటి రతనాల వీణ కవిత్వం అందరినీ ఉర్రూతలూగించిందని, ఉద్యమానికి ఊపిరులూదిందని గుర్తు చేశారు.

మలివిడత తెలంగాణ ఉద్యమంలోనూ కవులు, కళాకారులు, సాహితీవేత్తలు పోషించిన పాత్ర మరువలేనిదని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వారిని కూడా సత్కరించుకోవాలనే ఉద్దేశంతో సాహిత్య దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, మహాకవి దాశరథి నిజామాబాద్‌ వాస్తవ్యులు కానప్పటికీ ఈ ప్రాంతంతో ఆయనకు విడదీయరాని బంధం ఏర్పడిరదని అన్నారు. దశరథిని నిర్బంధించిన నిజామాబాద్‌ ఖిల్లా జైలు గోడలపైన ఆయన రాసిన కవిత్వాలు ఎంతోమందిని ఉత్తేజపర్చాయని అన్నారు.

సాహిత్యాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన గొప్ప కవి అని కొనియాడారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాహిత్య దినోత్సవ కార్యక్రమానికి కవులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, రచయితలను గౌరవించుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడిరదన్నారు. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కవుల సాహిత్యానికి ప్రజా ఉద్యమాలతో ఎంతో సాన్నిహిత్యం ఉందని అన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని కీలక దశకు తీసుకెళ్లి చరిత్ర పుటలకెక్కిన ఘనత కవులు, కళాకారులదని గుర్తు చేశారు. కవులు, కళాకారుల ఆటా పాటలు ఎన్నో పోరాటాలకు ఫలితాలను అందించాయని, సబ్బండ వర్ణాలను ఏకతాటిపైకి తెచ్చాయని అన్నారు. ఉద్యమం చల్లారిన ప్రతీసారి తమ కవిత్వంతో అగ్గి రగిలించారని, సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, సాగరహారం ఇలా ఎన్నో సందర్భాలలో తెలంగాణ కవులు ఉద్యమ ఉద్ధృతికి బాటలు వేశారని కొనియాడారు.

బతుకమ్మ, బోనాలు, రాస్తారోకోలు, రహదారుల బంద్‌, రోడ్లమీద వంటావార్పు – సామూహిక భోజనాలు వంటి ఉద్యమ రూపాలన్నీ కవిత్వంలోనూ భాగమయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా కవిసమ్మేళనంలో పాల్గొన్న కవులందరిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక, రూ. 1116 నగదు పారితోషకంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీసీఓ సింహాచలం, బాలభవన్‌ పర్యవేక్షకులు ప్రభాకర్‌, కవి సమ్మేళనం నిర్వాహక కమిటీ సభ్యులు గంట్యాల ప్రసాద్‌, డాక్టర్‌ వి.త్రివేణి, తిరుమల శ్రీనివాస్‌ ఆర్య, మద్దుకూరి సాయిబాబు, అధిక సంఖ్యలో కవులు, సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »