కామారెడ్డి, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2 కే రన్ కు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అపూర్వ స్పందన లభించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్ ముగింపు సమావేశం ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గోవర్ధన్ మాట్లాడారు.
ఆరోగ్య పరిరక్షణకు పరుగు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఉదయం నడక అలవాటు చేసుకోవాలని చెప్పారు. యోగ, వ్యాయామం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రన్‌లో చిన్నారులు, యువకులు, వృద్ధులు ఆసక్తిగా పాల్గొన్నారని తెలిపారు. ఆదివారం కళాభారతిలో చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు సాహిత్య దినోత్సవం ప్రత్యేకతను తెలియజేశాయని చెప్పారు.
రూ. ఆరు కోట్లతో కళాభారతి ఆడిటోరియం నిర్మించినందుకు దానికి ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయని తెలిపారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రతాప్ కామారెడ్డి కళాక్షేత్రంలో శాస్త్రీయ నృత్యాలు చిన్నారులకు నేర్పించి కామారెడ్డి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చారని చెప్పారు.
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేళ్లలో జిల్లా అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించిందని, వాటి విజయ గాధలను ప్రజలకు తెలియజేయడానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. సమాజంలో పోలీసుల పాత్ర చాలా గొప్పదని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, డీఎస్పీ సురేష్, సిఐ నరేష్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, పోలీసులు పాల్గొన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తెలంగాణ రన్ ను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జెండా ఊపి ప్రారంభించారు.లి కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా ఎక్స్ రోడ్ నుంచి 2 కె రన్ (పరుగు) ఇందిరాగాంధీ స్టేడియం వరకు కొనసాగింది. రన్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, పోలీసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.