ఓటరు జాబితా క్షుణ్ణంగా పరిశీలించాలి

నిజామాబాద్‌, జూన్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా రూపొందించిన ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఏవైనా లోటుపాట్లను గుర్తిస్తే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఎన్నికల అధికారులు, బీ.ఎల్‌ ఓ లతో పాటు రాజకీయ పార్టీల పాత్ర కూడా ఎంతో క్రియాశీలకమైనదని గుర్తు చేశారు. దీనివల్ల ఓటరు జాబితా పక్కాగా రూపకల్పన జరిగి ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉండదని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఓటరు జాబితాలో ఏవైనా మార్పులు, చేర్పులు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తే, తమకు ప్రతిపాదనలు అందించాలన్నారు.

వాటిని ఎన్నికల అధికారులచే పరిశీలన జరిపించి, సహేతుకమైన వాటిని ఆమోదిస్తూ మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ఎక్కడైనా పోలింగ్‌ స్టేషన్‌ మార్చాల్సి ఉన్నా, కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలను ప్రతిపాదించవచ్చని సూచించారు. అలాగే ఎక్కడైనా ఒక ప్రాంతానికి చెందిన ఓటర్లను సమీప పోలింగ్‌ బూత్‌ పరిధిలో కాకుండా వేరే దూర ప్రాంతంలోని బూత్‌ పరిధిలో ఓటరుగా చేర్చినట్లు గుర్తిస్తే, అలాంటి ఓటర్ల వివరాలను తమకు అందించాలని అన్నారు.

జాబితాలో పేర్లు లేని ఓటర్ల వివరాలతో పాటు, ఓటరు గుర్తింపు కార్డులో ఫోటో సరిగా లేని వాటిని, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు పేరు ఉండడం, ఒక సెగ్మెంట్‌ ఓటరు పేరు మరో సెగ్మెంట్‌ ఓటరు జాబితాలో ఉండడం, ఇతరాత్ర మార్పులు, చేర్పుల గురించి కూడా తెలియజేయవచ్చని సూచించారు. వీటికి సంబంధించి జూలై 24 వ తేదీ లోపు తమకు ప్రతిపాదనలు అందిస్తే, వాటి ఆధారంగా సవరణలు చేసిన ఓటరు జాబితాతో ఆగస్టు 2 న డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ చేస్తామని కలెక్టర్‌ వివరించారు.

2023 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తవుతున్న యువతీయువకుల పేర్లు, వివరాలను ఓటరు జాబితాలో చేర్పించాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గందరగోళానికి ఆస్కారం లేకుండా పక్కాగా ఓటరు జాబితా రూపకల్పన జరిగేలా తోడ్పాటును అందించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటరు జాబితాలో బోగస్‌ ఓటర్లు, డూప్లికేషన్‌ లకు తావులేకుండా పకడ్బందీ పరిశీలన జరపాలన్నారు. బూత్‌ లెవెల్‌ అధికారులతో నిర్వహిస్తున్న ఇంటింటి పరిశీలన కార్యక్రమానికి కూడా సహకారం అందించాలని కలెక్టర్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాల ఈ.ఆర్‌.ఓలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌ పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »