తండాలకు పంచాయతీ హోదాతో గిరిజనులకు పాలనాధికారం

నిజామాబాద్‌, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. తండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి బంజారాల చిరకాల వాంఛను నెరవేర్చారని, దీనివల్ల తండాలను గిరిజనులే సర్పంచులు, వార్డ్‌ మెంబర్లుగా ఎన్నికై పాలించుకుంటున్నారని తెలిపారు. భీంగల్‌ మండలంలో నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడిన సంతోష్‌ నగర్‌ తండా, సుదర్శన్‌ నాయక్‌ తండాలలో రూ. 20 లక్షల చొప్పున నిధులతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు.

గిరిజన మహిళలు తమ సంప్రదాయ నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు.
అడవి బిడ్డలైన బంజారాల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.

గిరిజనులకు పాలనాధికారం కల్పించాలనే లక్ష్యంతో 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీ హోదా కల్పించారని అన్నారు. గ్రామ పంచాయతీలకు పక్కా భవనాల నిర్మాణాల కోసం ఒక్కో జీ.పీ కి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి తండాకు రోడ్డు సదుపాయం ఏర్పడిరదని, 100 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగిస్తున్న గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ అమలవుతోందని గుర్తు చేశారు. అన్నింటికి మించి గిరిజన బిడ్డలకు అధునాతన సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యా బోధన అందాలనే తాపత్రయంతో కొత్తగా ఎస్టీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

ప్రభుత్వ సంకల్పంతో ప్రస్తుతం ప్రతి ఏటా సుమారు లక్ష మంది వరకు గిరిజన బిడ్డలు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆరు శాతానికి పరిమితమైన గిరిజన రిజర్వేషన్‌ ను జనాభా ప్రాతిపదికన పది శాతానికి పెంచిన ఫలితంగా విద్యా, ఉద్యోగావకాశాలు మెరుగుపడ్డాయని అన్నారు.

అన్నింటికీ మించి గిరిజన తండాల్లోని ప్రతి గుడిసె, ప్రతి ఇంటికి ప్రభుత్వం కుళాయిల బిగించి మిషన్‌ భగీరథ ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తోందని, దీనివల్ల అడవి బిడ్డలకు విష జ్వరాలు, అనారోగ్యాల బారిన పడే పరిస్థితి దూరమయ్యిందని అన్నారు. అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »