ఘనంగా తెలంగాణ హరితోత్సవం

నిజామాబాద్‌, జూన్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతీ చోట విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మెండోరా, మోర్తాడ్‌ మండలాల్లో హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొనగా, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు భాగస్వాములయ్యారు.

ముందుగా మెండోరా మండలంలోని పోచంపాడ్‌ గ్రామంలో గల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు దిగువ భాగంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ దశాబ్ది సంపద వనాలు క్షేత్రంలో అధికారులు, విద్యార్థులు, మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మోర్తాడ్‌ మండలం దొన్పాల్‌ గ్రామ పరిధిలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌ అటవీ భూమిలో డిఎఫ్‌ఓ వికాస్‌ మీనా తో కలిసి వివిధ రకాల మొక్కలను పెద్ద ఎత్తున నాటారు. కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ కు చెందిన విద్యార్థిని విద్యార్థులు హాజరవగా, వారికి హరితహారం కార్యక్రమం ప్రాధాన్యత గురించి అటవీ శాఖ అధికారులు వివరించారు.

హరితహారం ద్వారా రాష్ట్రంలో పెంపొందించబడిన అటవీ విస్తీర్ణం, విస్తృత స్థాయిలో పెరిగిన పచ్చదనం గురించి తెలియజేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు. 2014కు ముందు నెలకొని ఉన్న పరిస్థితి, ప్రస్తుతం వృద్ధి చెందిన అటవీ వనాల గురించి శాటిలైట్‌ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వివరించడం విద్యార్థులను ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత గురించి కలెక్టర్‌ నొక్కి చెప్పారు.

హరితహారం కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పకడ్బందీ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా నిర్వహిస్తుండడంతో చేకూరిన ప్రయోజనాలు, రాష్ట్రానికి వరించిన అవార్డుల గురించి విద్యార్థులకు తెలియజేశారు. మండుటెండను సైతం ఖాతరు చేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ర్యాలీలుగా ఆయా గ్రామాల్లో నర్సరీలను, పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను సందర్శిస్తూ ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల వద్ద అందమైన రంగవల్లులు వేసి, పూల దండలు, మామిడి ఆకు తోరణాలతో అందంగా అలంకరించారు. కలెక్టర్‌ వెంట డిఆర్డిఓ చందర్‌, డిసిఓ సింహాచలం, ఎఫ్‌డిఓ భవాని శంకర్‌ తదితరులు ఉన్నారు.

ఎస్సారెస్పీ రిజర్వాయర్‌ ను సందర్శించిన కలెక్టర్‌

తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. డ్యాం పైభాగానికి చేరుకొని రిజర్వాయర్లో ఉన్న నీటి నిల్వ ల గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గత వర్షాకాలంలో ఎస్సారెస్పీలోకి వచ్చి చేరిన వరద జలాలు, వివిధ కాలువల ద్వారా విడుదల చేసిన నీటి నిలువల గురించి ప్రాజెక్టు ఎస్‌.ఈ శ్రీనివాస్‌, ఈ.ఈ చక్రపాణిలు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »