కామారెడ్డి, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని ఏంపీ బీబీ పాటిల్ అన్నారు. నిజాంసాగర్ మండలం మంగుళూరులో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం హరితోత్సవం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు.
పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, అధికారులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. పాఠశాల విద్యార్థులకు మొక్కల సంరక్షణ, జంతువుల సంరక్షణ పై అటవీ అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. మొక్కలను పెంచడం వల్ల భావితరాలకు ప్రాణవాయువు లభిస్తుందని చెప్పారు. తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని పేర్కొన్నారు. మొక్కల సంరక్షణ కోసం ప్రభుత్వం గ్రీన్ బడ్జెట్ను కేటాయించిందని తెలిపారు.
ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడారు. 8 ఏళ్లలో జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెరిగిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేశారని కొనియాడారు. ఔషధ మొక్కల ప్రాముఖ్యతను వివరించారు. మొక్కలు పెంచడం వల్ల గ్రామాల్లో పచ్చదనం పెరిగి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడు తాయని పేర్కొన్నారు. అటవీ శాఖ రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. డ్రాయింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులను ఎంపీ బీబీ పాటిల్ అందజేశారు. అనంతరం అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.