విద్యా వికాసంలో తలమానికం తెలంగాణ

నిజామాబాద్‌, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న కార్యక్రమాలతో విద్యారంగంలో సమూలమైన మార్పులతో తెలంగాణ దేశంలోనే సాటిలేని మేటిగా మారిందని వక్తలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.

అన్ని పాఠశాలల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులకు ప్రభుత్వంఉచితంగా సమకూర్చిన పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్కులు పంపిణీ చేశారు. బాలబాలికలకు బలవర్ధక పోషక ఆహారమైన రాగి జావాను అందించారు. మన ఊరు – మన బడి కింద మౌలిక వసతుల కల్పన నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న పాఠశాలల్లో ప్రజాప్రతినిధులచే ప్రారంభోత్సవాలు చేయించారు.

ఇందులో భాగంగానే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన విద్యా దినోత్సవం కార్యక్రమానికి కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధ్యక్షత వహించారు. జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో విద్యా దినోత్సవ సంరంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, ఎమ్మెల్యే గణేష్‌ గుప్తాలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు విద్యా, వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సరికొత్త విధానాలతో విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోందన్నారు. మౌలిక సదుపాయాలు, అధునాతన వసతులతో అలరారుతున్న సర్కారీ బడుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయని, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు సైతం కార్పొరేట్‌ తరహా బోధనతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారని కొనియాడారు.

ప్రజాప్రతినిధుల ప్రమేయానికి తావులేకుండా విద్యార్థుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని తొలివిడతలో జిల్లాలో 407 పాఠశాలల్లో మన ఊరు – మన బడి/ మన బస్తీ-మన బడి కింద సమగ్ర అభివృద్ధికై రూ. 150 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. అన్ని మౌలిక సదుపాయాలతో పాటు, డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌, ఆంగ్ల మాధ్యమ బోధనతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమగ్రంగా మార్చివేశారని కొనియాడారు. 2014 వ సంవత్సరం నాటితో పోలిస్తే స్వరాష్ట్రంలో విద్యారంగం సాధించిన పురోగతిలో గుణాత్మకమైన మార్పు స్పష్టంగా గోచరిస్తుందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం రెసిడెన్షియల్‌ స్కూళ్లను విరివిగా ఏర్పాటు చేసి, ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం సాలీనా లక్షా 50 వేల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు. అన్ని రంగాలలో సమ్మిళిత అభివృద్ధిని సాధించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధిలో ఆ శాఖ అధికారులు, సిబ్బంది కృషి ఎనలేనిదని ప్రశంసించారు. ఇకముందు కూడా ఇదే తరహా స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా బోధనా సామర్ధ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుని విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు.

విద్యారంగంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆధునిక సాంకేతకతను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడమే పరమావధిగా పెట్టుకోకుండా, విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన గుణాత్మకమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు అంకింత భావంతో కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు ఎంత ఉన్నత స్థానాలకు చేరినా, తాము చదివిన బడిని, విద్యను నేర్పిన గురువును, తాము నివసించిన ప్రాంతాన్ని మరువకూడదని విద్యార్థులకు హితబోధ చేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను, పదవ తరగతిలో 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్‌, బంగారు నవనీత, సెక్టోరల్‌ అధికారి చంద్రశేఖర్‌, సీఎంఓ శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »