నిజామాబాద్, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్ మైదానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా న్యూ అంబేద్కర్ భవన్ వరకు కొనసాగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్, జిల్లా సంక్షేమ ధికారిణి ఎస్.కె. రసూల్ జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం న్యూ అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వక్తలు ప్రసంగించారు. డిసెంబర్ 7, 1987న జరిగిన ఐక్యరాజ్య సమితి 93వ ప్లీనరీ సమావేశం తర్వాత, డిసెంబర్ 13, 1985న చేసిన 40/122 తీర్మానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాదకద్రవ్యాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, వాటి వినియోగం వల్ల సమాజానికి కలిగే హాని గురించి వివరించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీని ‘‘మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం’’గా పరిగణించాలని తీర్మానించారని తెలిపారు.
ఇందులో భాగంగా గత 36 సంవత్సరాలుగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరుగుతోందన్నారు. వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబానికి, సమాజానికి ఎనలేని చేటు చేసే మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని హితవు పలికారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు తమవంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కళాజాత బృందం సభ్యులు తమ ప్రదర్శన ద్వారా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి సులభంగా అర్ధమయ్యేలా, ఆకట్టుకునే రీతిలో తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగ నిరోధంపై ప్రతిజ్ణ చేయించి, పోస్టర్లు కరపత్రాలను.ఆవిష్కరించి ప్రజలకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎక్సయిజ్ ఎస్.ఐ మల్లేశ్, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ప్రతాప్, మెప్మా అధికారిణి మాధురి, సి.డబ్య్లూ.సి. చైర్ పర్సన్ సంపూర్ణ, స్నేహా సొసైటీ సెక్రెటరీ సిద్దయ్య, గాడ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు శోభారాణి, ఏ.పి. ఫోరం అధ్యక్షుడు రమేశ్, జువైనల్ జస్టీస్ బోర్డు మెంబర్ శ్రీలత, సఖీ సిబ్బంది, సి.డి.పి.ఓ.లు, కార్యాలయ సిబ్బంది, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్యా సిబ్బంది, బాలరక్షా భవన్ సిబ్బంది, నిషిత, కాకతీయ తదితర కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.