గ్రూప్‌-4 పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూన్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీ ఎస్‌ పీ ఎస్‌ సీ) ద్వారా జూలై 1 వ తేదీన జరుగనున్న గ్రూప్‌-4 పరీక్ష నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. గ్రూప్‌-4 పరీక్షలను పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో చీఫ్‌ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

పరీక్ష ఏర్పాట్ల గురించి, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల గురించి అదనపు కలెక్టర్‌ ఈ సందర్భంగా తెలియజేశారు. జూలై 1 వ తేదీన ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగే గ్రూప్‌-4 పరీక్షకు జిల్లాలో 39183 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వివరించారు. వీరి కోసం125 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటికే అత్యధిక మంది హాల్‌ టికెట్‌ లను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారని, మిగతా వారు కూడా డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమవెంట తప్పనిసరిగా ఆధార్‌, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐ.డీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి ఫోటో ఆధారిత గుర్తింపు కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తేవాలని, బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌ తెచ్చుకోవాలని సూచించారు. సెల్‌ ఫోన్‌, క్యాలిక్యులేటర్‌, స్మార్ట్‌ వాచ్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తేకూడదని, ఎగ్జామ్‌ ప్యాడ్‌ కు అనుమతి లేనందున వెంట తెచ్చుకోకూడదని అన్నారు.

ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తనిఖీ సిబ్బందితో పాటు ప్రత్యేకంగా మెటల్‌ డిటెక్టర్‌ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. షూ వేసుకోకూడదని, చెప్పులు ధరించి రావాలని తెలిపారు. హాల్‌ టికెట్‌ లో పొందుపర్చబడిన పరీక్షా కేంద్రాన్ని అభ్యర్థులు ముందుగానే వెళ్లి పరిశీలించుకుంటే పరీక్ష రోజున ఆదుర్దాకు గురయ్యే పరిస్థితి ఉండదని అదనపు కలెక్టర్‌ హితవు పలికారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి కనీసం 15 నిమిషాలు ముందే కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్‌ సూచించారు.

నిర్ణీత సమయం దాటిన అనంతరం గేట్లు మూసివేస్తారని స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులంతా ఉదయం 8 గంటల వరకు జిల్లా కేంద్రానికి చేరుకునేలా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ డ్యూయల్‌ డెస్క్‌ టేబుళ్లు, పరీక్షా గదుల్లో తగినంత వెలుతురు, సరిపడా లైటింగ్‌, తాగునీరు, టాయిలెట్‌ ఇత్యాది వసతులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ను నియమిస్తున్నామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్‌ సెంటర్‌ లను మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు మహిళా పోలీసు సిబ్బంది సైతం ఉంటారని, అభ్యర్థుల సహాయార్ధం బస్టాండ్లలో హెల్ప్‌ డెస్క్‌ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమిస్తూ,వారికి పరీక్షల నిర్వహణ, నిబంధనల పై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీ.సీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు.

ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక లైజనింగ్‌ ఆఫీసర్‌ ఉంటారని, ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అపశ్రుతులు, లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అభ్యర్థులు టీ.ఎస్‌.పీ.ఎస్‌.సీ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ మధుసూదన్‌ రావు, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్‌, డీఐఈఓ రఘురాజ్‌, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌, డీటీసీ వెంకటరమణ, చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »