నిజామాబాద్, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా తుది ఓటర్ల జాబితా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ బుధవారం ఆయా శాసన సభ నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్‌లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిశీలన తీరుతెన్నుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, జాబితా రూపకల్పనలో పాటించాల్సిన జాగ్రత్తలు, పోలింగ్ కేంద్రాల పరిశీలన తదితర అంశాలపై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా నుండి వివిధ కారణాలతో పేర్లు తొలగించినట్లైతే, సంబంధిత కుటుంబీకులకు రిజిస్టర్ పోస్టు ద్వారా ఆ సమాచారాన్ని తెలియజేయాలన్నారు. ఒకే ఇంట్లో ఆరుగురు అంతకంటే ఎక్కువమంది ఓటర్లు ఉన్నట్లు గుర్తిస్తే, క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అన్ని ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పకడ్బందీగా జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు.
బీ.ఎల్.ఓ లు, సూపర్వైజర్‌ల క్షేత్ర స్థాయి పరిశీలన ప్రక్రియను ఎన్నికల, సహాయ ఎన్నికల అధికారులు సైతం ర్యాండమ్ గా చెక్ చేసుకోవాలని అన్నారు. ఓటరు జాబితాలో 18 -19 సంవత్సరాల వయస్సు వారితో పాటు, వివిధ వయస్సు కలిగి ఉన్న ఓటర్ల వివరాలను పొందుపర్చాలని సూచించారు. ముఖ్యంగా దివ్యాంగ ఓటర్ల పేర్లను ప్రత్యేకంగా మార్కింగ్ చేయాలని, దీనివల్ల పోలింగ్ కేంద్రాల్లో వారికి వీల్ చైర్, ర్యాంప్ వంటి సదుపాయాలు సమకూర్చడం జరుగుతుందన్నారు. తహశీల్దార్లు తప్పనిసరిగా ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎక్కడైనా పోలింగ్ కేంద్రాన్ని మార్చాల్సి ఉన్నా, లేక కొత్తగా ఏర్పాటైన కాలనీల వద్ద నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తిస్తే ప్రతిపాదించాలని అన్నారు.
ఓటరు జాబితాలో ఎలాంటి లోటుపాట్లు, తప్పులు లేకుండా క్షుణ్ణంగా పరిశీలన చేసుకుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల సంఘం నియమ, నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తూ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ చందర్, జెడ్పి సీఈఓ గోవింద్, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్ లు పాల్గొన్నారు.