కామారెడ్డి, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ సభలలో గుర్తించిన సమస్యలను పది రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషల్ ఆఫీసర్‌లు, మండల అభివృద్ధి, మండల పంచాయితీ, ఏపీడిలు, ఏపివోలు, గ్రామ పంచాయితీ సర్పంచులు, గ్రామ పంచాయతీ సెక్రెటరీలతో పల్లె ప్రగతి కార్యక్రమాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభలలో గుర్తించిన పనులను పూర్తి చేయడంలో వెంటనే పూర్తి చేయడానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని అన్నారు. వర్షాలు పడుతున్నందున ప్లాంటేషన్ పూర్తి చేసుకోవాలని, అన్ని రోడ్లలో ప్లాంటేషన్ చేపట్టాలని, అదనపు వరుసలలో, గ్యాప్‌లో, కొత్తగా మొక్కలు నాటాలని, 100 శాతం అవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇంటి అవసరాల కోసం ఇచ్చే ఆరు మొక్కలకు సంబంధించి ఏ రోజు, ఏ వార్డులో, ఎవరికి ఇచ్చే వివరాలను టామ్ టామ్ ద్వారా చెప్పాలని, వారు అడిగిన మొక్కలను ఇవ్వాలని, మొక్కలు ముట్టినట్లు రిజిస్టర్‌లో సంతకాలు తీసుకోవాలని తెలిపారు.
మండలానికి ఒక బృహత్ పల్లె ప్రక ృతి వనం పనులు చేపట్టేందుకు ఎస్టిమేషన్స్ తయారు చేయాలని, మియావాకి పద్ధతిలో ప్లాన్ చేసుకోవాలని సూచించారు. వైకుంఠ ధామాలు, కంపోస్ట్ షెడ్లకు రెండు మూడు వరుసలలో పెద్ద మొక్కలతో హరిత కంచెను ఏర్పాటు చేయాలని తెలిపారు. హైవేపై నిర్వహించే ప్లాంటేషన్ అటవీశాఖ వారి సమన్వయంతో పూర్తిచేయాలని తెలిపారు.
గ్రామాలలోని అన్ని అంతర్గత రోడ్లలో ప్లాంటేషన్ జరగాలని, మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించాలని, గతంలో నిర్వహించిన ప్లాంటేషన్‌లో మొక్కల పరిస్థితిని గమనించాలని, వాటికి పాదులు తీయడం, ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామ సర్పంచ్ తాను చేసిన పనులు ప్రజలు గుర్తుంచుకోవాలంటే తన గ్రామాన్ని హరిత గ్రామంగా చేయడమే మార్గమని, చెట్లను భవిష్యత్ తరాల వారు గుర్తుంచుకుంటారని అన్నారు.
10వ తేదీ లోగా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎలాంటి చెత్త లేకుండా మురికి కాలువలలో పూడికతీత పనులు వంద శాతం నిర్వహించాలని, తద్వారా సీజనల్ వ్యాధులు అరికట్టవచ్చని తెలిపారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేయాలని సూచించారు. గ్రామంలో చెత్త కుప్పలు, పాడుబడిన దిబ్బలు, ఇల్లు కట్టగా మిగిలిన రోడ్డుపైన సామాగ్రిని తొలగించాలని తెలిపారు.
పాడుబడిన, పనిచేయని బోర్ వెల్స్, బోరుబావులను కచ్చితంగా పూడ్చాలని, రోడ్లపై ఉన్న పూడ్చాలని తెలిపారు. త్రాగునీటి వ్యవస్థను మెరుగు పరుచుకోవాలని, మిషన్ భగీరథ నల్లాలు బిగించి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని, శుభ్రం చేసిన తేదీలను ట్యాంకులపై ప్రదర్శించాలని, క్లోరినేషన్ చేపట్టాలని తెలిపారు. విద్యుత్ పనులలో గతంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని తెలిపారు.
వైకుంఠ ధామాలు, కంపోస్ట్ షెడ్స్ వినియోగంలోకి తేవాలని తెలిపారు. శ్రమదానంపై ప్రజలను చైతన్య పరచాలని, 100 మందిని భాగస్వామ్యం చేసి పనులు నిర్వహించాలని తెలిపారు. మూడు వేల జనాభా కన్నా ఎక్కువ ఉన్న గ్రామంలో వైకుంఠ రథం, అలాగే క్లస్టర్ గ్రామాలలో రెండు బాడీ ఫ్రీజర్లు దాతల సహకారంతో పొందాలని సూచించారు. ఫాగింగ్ ప్రతిరోజు చేపట్టాలని తెలిపారు.
అధికారులు డైలీ రిపోర్టు నిర్ణీత సమయంలోగా పంపాలని తెలిపారు. జిల్లాలో ఉన్న 370 కిలోమీటర్ల మేర రోడ్డులో మూడు వరుసలలో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. దళిత ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కింద రెండు రోజులు ప్రత్యేక కార్యాచరణతో మౌలికవసతులను గుర్తించి నిర్ణీత ప్రొఫార్మాలో పొందు పరిచిన విధంగా వివరాలు సేకరించాలని, దీనికి సంబంధించి ఇడి ఎస్సీ కార్పొరేషన్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు మండల స్పెషల్ ఆఫీసర్లకు ఓరియెంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ బి.వెంకట మాధవరావు, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా ఎస్‌సి సంక్షేమ అధికారి రజిత, ఎపిడిలు సాయన్న, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.