పోడు పట్టాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూలై 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. పోడుపట్టాల పంపిణీ, గృహలక్ష్మి, ఎరువులు-విత్తనాల నిల్వలు, ఆయిల్‌ పామ్‌ సాగు, నివేశన స్థలాల అందజేత, కస్టమ్‌ మిల్లింగ్‌, తెలంగాణకు హరితహారం, బీ.సీ లకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఎస్‌ సమీక్ష నిర్వహించారు.

పోడు పట్టాల పంపిణీలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వారం రోజుల్లోపు అన్ని జిల్లాలలో పట్టాల పంపిణీ పూర్తి చేయాలని గడువు విధించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని సూచించారు. లబ్దిదారులకు రైతు బంధు ద్వారా ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా వారి బ్యాంకు అకౌంట్‌ వివరాలను సేకరించాలన్నారు. కాగా, గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తులను సేకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీ.ఎస్‌ కలెక్టర్లకు సూచించారు.

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్లో రైతులకు ఎక్కడ కూడా ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. యూరియా, డీ.ఏ.పీ, కాంప్లెక్స్‌ ఎరువుల నిల్వల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలన్నారు. ఈ విషయమై కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు స్పందిస్తూ, జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని సీ.ఎస్‌ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే జిల్లాలోని వివిధ సహకార సంఘాలలో 12 వేల 256 మెట్రిక్‌ టన్నుల ఎరువులు, డీలర్ల వద్ద 11 వేల 262 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉంచామని వివరించారు.

ఆయిల్‌ పామ్‌ సాగు విషయమై సీ.ఎస్‌ సమీక్షిస్తూ, ఖరీఫ్‌ సీజన్లో ఎక్కువ మంది రైతులు ఆయిల్‌ పామ్‌ పంట సాగు చేసేలా కృషి చేయాలన్నారు. గతేడాది తరహాలోనే పకడ్బందీ ప్రణాళికతో లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ సాగు జరగాల్సి ఉన్నందున, అవకాశం ఉన్న ప్రతి చోటా రైతులు దీని సాగుకు ముందుకు వచ్చేలా వారిని ప్రోత్సహించాలని, అవసరమైతే అంకితభావంతో పనిచేసే అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించి క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు.

రైతులకు వెంటదివెంట పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేస్తూ, సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు, ఆయిల్‌ పామ్‌ మొక్కలను అందించాలని ఆదేశించారు. అలాగే అర్హులైన వారికి నివేశన స్థలాల పంపిణీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటికే పట్టాలు అందించిన చోట వారికి కేటాయించిన స్థలాల్లో లబ్దిదారులే ఉంటున్నారా? లేదా? అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలన్నారు. కాగా, రైస్‌ మిల్లులకు సీ ఎం ఆర్‌ కింద కేటాయించిన ధాన్యాన్ని నిర్దిష్ట గడువులోగా మిల్లింగ్‌ జరిపి బియ్యం నిల్వలు గోడౌన్‌ లకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఎఫ్‌.సీ.ఐ గిడ్డంగులలో స్థలం సరిపడని పక్షంలో, సివిల్‌ సప్లిస్‌ గిడ్డంగులను వినియోగించుకోవాలని అన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్‌ మిల్లులలో వాటి సామర్ధ్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లా అధికారులతో పాటు తహసీల్దార్లు రైస్‌ మిల్లులను సందర్శించి కేటాయించిన ధాన్యం నిల్వలు ఎంత, వాటిలో ఎంత ధాన్యం మిల్లింగ్‌ జరిపారు, ఇంకనూ మిగిలిన ధాన్యం అందుబాటులో ఉందా లేదా అన్నది స్టాక్‌ రిజిస్టర్‌ ఆధారంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపించాలని ఆదేశించారు. రైస్‌ మిల్లర్లకు నిర్దిష్ట పరిమాణంలో ధాన్యం కేటాయిస్తూ, 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా అందిస్తున్నందున నిర్ణీత గడువులోపు వారు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ సకాలంలో అందించాల్సిందేనని సీ.ఎస్‌ స్పష్టం చేశారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేలా చొరవ చూపాలన్నారు. రోడ్లకు ఇరువైపున, చెరువులు, కాల్వ గట్లపైన, ఇరిగేషన్‌ భూములు, అటవీ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటేలా గుంతలు తవ్వించాలని సూచించారు. వర్షం అనుకూలించిన వెంటనే మొక్కలు నాటేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలన్నారు. బీ.సీలకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం, గొర్రెల పంపిణీ తదితర పథకాల అమలు తీరు, ప్రగతిని సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్‌ మీనా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »