పోడు భూముల్లో ఇక దర్జాగా సాగు

నిజామాబాద్‌, జూలై 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఎవరికీ భయపడాల్సిన, అణిగిమనిగి ఉండాల్సిన అవసరం లేకుండా భూముల హద్దులతో కూడిన సమగ్ర నక్షాతో ప్రభుత్వం పక్కాగా పట్టా పాస్‌ బుక్కులు అందిస్తోందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం దొమ్మర్‌ చౌడ్‌ తండాలో (డీ.సీ తండా) లబ్ధిదారులకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బుధవారం పోడు భూముల పట్టా పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశారు.

అమీర్‌ నగర్‌ తండా, సర్పంచ్‌ తండా, డీ.సీ తండా, కోనాపూర్‌ కేసి తండా, ఊప్లనాయక్‌ తండా, సోమిడి తండా, బిల్యానాయక్‌ తండా, గుడిమల్కాపూర్‌ తండాలకు చెందిన 190 మంది లబ్ధిదారులకు 590 ఎకరాల పోడు భూమికి సంబంధించిన పట్టా బుక్కులు అందజేశారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా గ్రామ పంచాయతీల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోడు భూముల్లో పంట సాగు చేసుకునేందుకు గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. వారి బాధలను దూరం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న పట్టాలతో లక్షలాది గిరిజన కుటుంబాలకు పోడు భూములపై యాజమాన్య హక్కులు ఏర్పడ్డాయని హర్షం వెలిబుచ్చారు. తరతరాలకు జీవనోపాధిని అందించే ఈ భూములను అమ్ముకోవద్దని మంత్రి హితవు పలికారు. పోడు భూముల లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ సీజన్‌ నుండే రైతు బంధు, రైతు బీమా పథకాలను వర్తింపచేస్తుందన్నారు. ఇందులో భాగంగా పట్టాల పంపిణీ కంటే ముందే లబ్ధిదారుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమ చేయడం జరిగిందని గుర్తు చేశారు.

ప్రతి ఆరు మాసాలకు ఒకసారి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ అవుతాయని, రైతు బీమా కూడా వర్తిస్తుందని వివరించారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా లక్షలాది ఎకరాల పోడు భూములకు హక్కులు పొందినందున ఇకపై అడవుల జోలికి వెళ్లకుండా వాటి సంరక్షణకు అడవి బిడ్డలుగా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. విస్తారమైన అటవీ ప్రాంతం ఉన్నప్పుడే వర్షాలు అనుకూలిస్తాయని, తద్వారా పంటలు సాగు చేసుకోగల్గుతామని అన్నారు. ఇంకను అర్హులు ఎవరికైనా పోడు పట్టాలు రానట్లయితే త్వరలోనే వారికి మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

గిరిజనుల సంక్షేమానికి, తండాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, రైతుబంధు, రైతు బీమా, సేద్యానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా వంటి పథకాలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. ప్రతి తండాకు సీసీ రోడ్లు, బిటి రోడ్లు నిర్మిస్తున్నామని, ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నామని, ఆసరా పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన సాగిస్తున్న తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.

కార్యక్రమంలో ఆర్డీఓ రవి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగురావు, కమ్మర్పల్లి ఎంపీపీ గౌతమి, జెడ్పిటిసి రాధ, మార్క్‌ ఫెడ్‌ మాజీ చైర్మన్‌ బాపురెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుణవీర్‌ రెడ్డి, స్ధానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »