దళిత సమాజం అంతటికీ దశల వారీగా దళితబంధు

నిజామాబాద్‌, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, అసమానతలకు గురవుతున్న దళిత జాతి అభ్యున్నతి కోసం మనసుపెట్టి పనిచేసే మహనీయ వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ప్రతి దళిత కుటుంబం పైకి రావాలనే తపనతో ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి తప్పనిసరిగా దళిత బంధు పథకం దశలవారీగా అమలై తీరుతుందని భరోసా కల్పించారు.

జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌ లో మంగళవారం డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రాం, డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో దళితరత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి విచ్చేయగా, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, అంబేడ్కరిజాన్ని నూటికి నూరు శాతం పుణికి పుచ్చుకున్న వ్యక్తి కేసీఆర్‌ అన్నారు.

ఓట్ల రాజకీయాలతో సంబంధం లేకుండా, గడిచిన డెబ్భై ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయనివిధంగా అణగారిన, దళిత వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు, వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. దళితబంధు పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 30వేల కుటుంబాలు లబ్ది పొందాయని, ఈ ఏడాది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1100 మంది చొప్పున మరో లక్షా 40వేల కుటుంబాలకు లబ్ది చేకూరుస్తామని తెలిపారు. వచ్చే ఏడాది సెగ్మెంట్‌ కు 2200 చొప్పున, ఆ మరుసటి ఏడాది 3300 చొప్పునా… ఇలా దశలవారీగా ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు కింద రూ. పది లక్షల గ్రాంటును అందించడం జరుగుతుందన్నారు.

ప్రతి దళిత కుటుంబాన్ని వ్యక్తిగతంగా లబ్ది చేకూరుస్తూ పేదరికం నుండి బయటకు తేవడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. బ్యాంకులింకేజీ, పైరవీలు, బ్రోకర్లకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకే ప్రయోజనం చేకూరేలా దళితబంధు ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు. దీంతో పాటు దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విద్యార్జన ఎంతో అవసరమని గుర్తించి, ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని వివరించారు.

యాభై సంవత్సరాలలో రాష్ట్రంలో కేవలం 230 రెసిడెన్షియల్‌ బడులు ఏర్పడగా, తొమ్మిదేళ్ల కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 1007 రెసిడెన్షియల్‌ స్కూళ్లను నెలకొల్పిందన్నారు. మారుమూల ప్రాంతాల అణగారిన వర్గాల బిడ్డలు సైతం ఉన్నత విద్యను అభ్యసించాలనే గొప్ప సంకల్పంతో కొత్తగా 85 రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేనని హర్షం వ్యక్తం చేశారు.

సామాన్య, నిరుపేద ప్రజలకు సైతం ఉచితంగా కార్పొరేట్‌ తరహా వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు హైదరాబాద్‌ లో పెద్ద ఎత్తున టిమ్స్‌(తెలంగాణ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఆసుపత్రులను నిర్మించడమే కాకుండా, ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల, కార్పొరేట్‌ ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే 24 గంటల ఉచిత విద్యుత్‌, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఇకముందు పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్య, వైద్యం, ఆర్థిక చేయూతను అందించడమే కర్తవ్యంగా కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి వేముల స్పష్టం చేశారు. ఎస్సీలలోని అన్ని ఉప కులాల వారికి ప్రభుత్వ పథకాలు వర్తించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అంబేడ్కర్‌ విగ్రహం నిర్మించే బాధ్యత దక్కడం పూర్వజన్మ సుకృతం

కాగా, ప్రపంచ మేధావిగా పేరుగాంచిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని నిర్మించే బాధ్యతలు తనకు దక్కడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా అంబేడ్కర్‌ విగ్రహం కట్టిస్తున్న సమయంలో తాను ఎంతో అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యానని అన్నారు. అంబేడ్కర్‌ ఆహార్యం, ఆ మహనీయుని నడవడిక గురించి లోతుగా అధ్యయనం చేస్తూ ప్రతి చిన్న అంశాన్ని సైతం సూక్ష్మంగా పర్యవేక్షణ జరుపుతూ అహరహం శ్రమించడంతో నభూతో నభవిష్యత్‌ అనే రీతిలో రాష్ట్ర రాజధానిలో ఎంతో ఠీవీగా అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కృతమైందని అన్నారు.

ప్రభుత్వం ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అందరికి స్ఫూర్తిని అందించేలా నిర్మింపజేసిన అంబేడ్కర్‌ విగ్రహంతో తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటిందని మంత్రి సంతృప్తి వెలిబుచ్చారు. ప్రపంచమంతా అబ్బురపడేలా నూతన సచివాలయం సైతం నిర్మించే అవకాశం తనకే దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ రెండు ఘట్టాలను తాను జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టడం అంబేడ్కర్‌ పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న గౌరవం, నిజాయితీ, చిత్తశుద్ధిని చాటిందన్నారు.

కాగా, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి సామాన్య కుటుంబం నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి వచ్చారని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు, అసమానతలను అధిగమిస్తూ ఉన్నత చదువులు చదివి, అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించినందునే నేడు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కాగలిగారని అన్నారు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలకు అనుగుణంగా, చైర్మన్‌ లింబాద్రిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి దళిత, అణగారిన వర్గాల బిడ్డ ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి మాట్లాడుతూ, ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని హితవు పలికారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తూ అనేక చర్యలు చేపడుతోందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవనాలు వెళ్లదీయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలోనే మరెక్కడా లేనివిధంగా వినూత్న రీతిలో సంక్షేమ, విద్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్‌, దళితబంధు ఈ కోవకు చెందిన పథకాలేనని అన్నారు.

ముఖ్యంగా బాలికలు, యువతులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారని వివరించారు. ఫలితంగా అణగారిన వర్గాలకు చెందిన అనేక మంది బాలికలు నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్‌ యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువు అభ్యసిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన 30 మందికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి దళితరత్న అవార్డులు ప్రదానం చేశారు. నిజామాబాద్‌ జిల్లా వాస్తవ్యులైన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం పాపయ్య, దళిత సంఘాల ప్రతినిధులు నాంపల్లి, బాబురావు, విద్యాసాగర్‌, శ్రీనివాస్‌, గైని గంగారం, ప్రముఖ విద్యావేత్త మారయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »