ఎడపల్లి, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ దీక్ష శిబిరంలో మండలానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు దీక్షలు కూర్చొని అర్థనగ్న ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బి. మల్లేష్, జంగం గంగాధర్ మాట్లాడుతూ కార్మికులు ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. గ్రామపంచాయతీ సిబ్బందినందరినీ పర్మినెంట్ చేయాలని, పంచాయతీ కార్మికులకు జీవో నెం. 60 ప్రకారం వేతనాలు పెంచాలని, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలని, కార్మికులకు రావలసిన వేతన బకాయిలను వెంటనే చెల్లించి, ప్రతి నెల మొదటి వారంలో ఇవ్వాలని పీఎఫ్ ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పి. రాజమణి, పద్మ, ఎంబ.లక్ష్మి, శ్రీను, కుంట సంతోష్, రైమత్, పాండు, యశ్వంత్, స్వామి, రాజయ్య తదితరులతో పాటు అన్ని గ్రామాలకు చెందిన గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.