కామారెడ్డి, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా జితేష్ వి పాటిల్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో 2వ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం-2023, ఓటర్ జాబితా తయారీ, ఓటరు నమోదు పురోగతి, ఓటరు జాబితా సవరణ తదితరాలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చర్చించారు.
2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారందిరినీ ఓటరుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీలు ప్రోత్సహించాలన్నారు. వివి ప్యాట్లతో ఓటు హక్కు ప్రాముఖ్యతపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆగస్ట్ 26,27 తేదీల్లో, సెప్టెంబర్ 3 వ తేదీన మొత్తం మూడు రోజులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ 3 రోజులు అన్ని పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండి కొత్త ఓటర్ల నమోదు పాటు, అభ్యంతరాలను కూడ స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితాలో సవరణలు, మొదలగు పనులు పూర్తి చేసి ఆగస్టు 21న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన నాణ్యత ఓటరు జాబితా తయారు చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.