ఓటర్ల జాబితాలో తప్పిదాలకు ఆస్కారం ఉండకూడదు

నిజామాబాద్‌, జూలై 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూడాలని, ముఖ్యంగా డబుల్‌ ఎంట్రీ, బోగస్‌ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్‌.ఓ మొదలుకుని ఈ.ఆర్‌.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అదే సమయంలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి గల్లంతు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఈ.ఓ సమీక్ష జరిపారు.

క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఇంటింటికి తిరిగి పరిశీలన జరిపే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మార్పులు-చేర్పులకు సంబంధించి పెండిరగ్‌ లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, వాటిని ఆన్లైన్‌ లో అప్‌ లోడ్‌ చేయించాలన్నారు. మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించే సమయంలో నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని, క్షేత్ర స్థాయిలో పర్యటించి మరణ ధ్రువీకరణ పత్రం వంటి ఆధారాలను సేకరించాలని సూచించారు. ఒకే ఇంట్లో ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నివాసాలను సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరణ చేసుకోవాలని అన్నారు.

కాగా, పోలింగ్‌ కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ లో మహిళలు, పురుషులకు వేర్వేరుగా కనీసం రెండు టాయిలెట్లు ఉండాలన్నారు. విద్యుత్‌ సరఫరా, తాగునీటి వసతి, ర్యాంపులు, సరిపడా ఫర్నీచర్‌ వంటి సదుపాయాలు ఉన్నాయా లేదా అన్నది ప్రతి పోలింగ్‌ కేంద్రం వారీగా పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా సౌకర్యాల లేమి ఉన్నట్లు గమనిస్తే తక్షణమే సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలన్నారు.

ఈవీఎం, వి.వి.ప్యాట్‌ ల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి నియోజకవర్గ పరిధిలో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అవగాహన కేంద్రాలతో పాటు, సంచార వాహనాల ద్వారా వీటి పనితీరు గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జూలై 28 నుంచి స్విప్‌ కార్యక్రమాలు విస్తృతం చేస్తూ, రాజకీయ పార్టీలకు సమాచారం అందించాలని అన్నారు.

మొదటి దశ పరిశీలన (ఎఫ్‌.ఎల్‌.సి) పూర్తయినందున సమర్ధవంతంగా పని చేస్తున్న ఈవిఎం, వివిప్యాట్‌ యంత్రాల వివరాలను రాజకీయ పార్టీలకు తెలియజేయాలని, ఈవీఎం గోడౌన్ల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని, అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఈవిఎం, వివిప్యాట్‌ యంత్రాలు ఉండే స్ట్రాంగ్‌ రూంలలో తప్పనిసరిగా ఫైర్‌ అలారంలు ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది, అందుబాటులో ఉన్న సిబ్బంది, వారికి శిక్షణ తరగతుల నిర్వహణ తదితర అంశాలతో సమగ్ర ప్రణాళిక రూపొందించి తమకు సమర్పించాలని, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఎలాంటి తప్పిదాలు లేకుండా ఓటరు జాబితా పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సి.ఈ.ఓ దృష్టికి తెచ్చారు. మృతి చెందిన, శాశ్వతంగా ఇతర ప్రాంతానికి తరలివెళ్లిన 73924 మంది పేర్లను జాబితా నుండి తొలగించడం జరిగిందని, వీటికి సంబంధించి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన జరిపించామన్నారు. ఆరుగురు అంతకంటే ఎక్కువమంది ఓటర్లు ఉన్న ఇండ్లు జిల్లాలో 27297 ఉండగా, ఇప్పటికే 25692 నివాసాలలో పరిశీలన పూర్తయ్యిందని తెలిపారు.

ఇదిలాఉండగా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో వీ.సీ ముగిసిన మీదట కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఈ.ఆర్‌.ఓలు, ఏ.ఈ.ఆర్‌.ఓలు, తహశీల్దార్లతో సమీక్ష జరిపారు. ఓటరు జాబితా నుండి పేర్లు తొలగించిన ఓటర్ల వివరాలను తక్షణమే అందుకు గల సహితకమైన కారణాలను పొందుపరుస్తూ ఆన్‌ లైన్‌ లో అప్లోడ్‌ చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ నెల 15 వ తేదీ సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

పెండిరగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని, నియోజకవర్గాల వారీగా మొబైల్‌ వ్యాన్లు ఏర్పాటు చేసి ఈవిఎం, వివిప్యాట్‌ యంత్రాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్‌, డీసీఓ సింహాచలం, ఆర్డీఓలు రవికుమార్‌, రాజేశ్వర్‌, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు, సహాయ ఈ.ఆర్‌.ఓలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌, సాత్విక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »