కామారెడ్డి, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత పోటీతత్వం పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి లో నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం యువజనోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. యువత చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో రాణించాలని, సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనబరచిన యువకులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతారని, అక్కడ రాణించిన వారిని జాతీయ స్థాయి పోటీలకు పంపుతారని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా ఉపన్యాస, వ్యాసరచన, పెయింటింగ్, నృత్యాలు, చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్, ఎస్‌బిఐ ఆధ్వర్యంలో దుస్తులు, మత్స్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, నెహ్రు యువ కేంద్రం తదితర శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కలెక్టర్ తిలకించారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో జిల్లా నెహ్రు యువ కేంద్రం సమన్వయకర్త శైలి, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, ఎన్నికల నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా మత్స్య శాఖాధికారి వరదారెడ్డి, వివిధ ప్రైవేట్ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.