నిజామాబాద్, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓ మయ్య, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చక్రపాణి, అధ్యక్షురాలు సాయమ్మ పాల్గొన్నారు.
నూడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. గత రెండు రోజుల క్రితం విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి డిఇఓలతో సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల వేతనాలు జూలై నెల నుండి పెంచుతున్నట్లు ప్రకటన చేయడం సమంజసం కాదన్నారు.
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 18 నెలల క్రితం కార్మికుల వేతనం 3000 పెంచుతున్నట్టు ప్రకటన చేసిన, మంత్రి కొత్త ప్రకటన చేయడం సరికాదన్నారు. కార్మికులు పిల్లలకు వంట చేసి పెట్టిన 9 నెలల బకాయి బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేదన్నారు. వంట పాత్రలు పిఎఫ్ ఈఎస్‌ఐ గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలని అంగన్వాడీ సెంటర్ల మాదిరిగా నిత్యవసర వస్తువులను ప్రభుత్వమే స్కూళ్లకు సరఫరా చేయాలని వీటిపై స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు నాగలక్ష్మి, పెద్దమ్మ, సాయమ్మ, లక్ష్మీబాయి, గంగమణి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.