కామారెడ్డి, జూలై 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా పరిపుష్టిని సాదించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్‌లో మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మహిళలు వ్యవసాయంతో పాటు చేపల, తేనెటీగల, పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, కూరగాయల సాగు, ఆయిల్‌ఫామ్ వంటి వాటిని చేపట్టి ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పారు.
ఈ సందర్భంగా తెలంగాణా గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వై.శోభ మాట్లాడుతూ అర్హత గల స్వయం సహాయక సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్నామని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో మహిళలు అభివృద్ధికి బాటలు వేసుకోవాలని చెప్పారు. పొదుపు రికవరీ విషయంలో నిర్లక్ష్యం తగదని, ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణబ్యాంక్ ద్వారా పంట రుణాలు, బంగారం పై రుణాలు గృహ రుణాలు వ్యక్తిగత ఋణం, విద్య ఋణం, మార్టిగేజ్ రుణాలు అందిస్తున్నామని అన్నారు.
గృహ రుణంపై ఫిక్సెడ్ రేట్ ఆఫ్ ఇంటరెస్ట్, డిపాజిట్లపైన వడ్డీ రేట్లు అన్ని బ్యాంకులకంటే అధిక వడ్డీ రేటు అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు పంట రుణంతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన రైతు నేస్తం రుణాలను, నీటిలో చేపల పెంపకంపై రుణాలు అందజే స్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రధాన మంత్రి సామాజిక భద్రతా పథకాలలో చేరి ఆర్ధిక భరోసా పొందాలని తెలిపారు. తెలంగాణా గ్రామీణబ్యాంక్ 427 శాఖలలో 25 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అధిగమించడం జరిగిందని చెప్పారు.
అనంతరం జిల్లా కలెక్టర్ స్వయం సహాయక సంఘాలకు 35 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. కార్యకమంలో రీజనల్ మేనేజర్ పురం నవీన్, డిఆర్‌డిఓ సాయన్న, లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్ భార్గవ్, డి.పి .ఏం. రవీందర్, గ్రామీణ బ్యాంక్ అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.