నిజాంసాగర్, జూలై 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి 813 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1388.03 అడుగుల నీటిమట్టం ఉన్నదని, అదేవిధంగా ప్రాజెక్టులో 17.802 టీఎంసీల నీటి సామర్ధ్యం ఉండగా ప్రస్తుతం 3.315 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.
నిజాంసాగర్ ఆయకట్టు రైతాంగం వరి నాట్లు పూర్తి స్థాయిలో వేసుకోవడం, దానికి అనుకూలంగా వర్షాలు కురవడం రైతులను సంతోషానికి గురిచేస్తోంది. అదేవిధంగా ఇంకా మూడు రోజులు భారీవర్షాలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలపడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోనికి వరదనీరు భారీగా వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరినాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.