నిజామాబాద్, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలలో పాల్గొనాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సంచార ప్రచార రథాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం పరిధిలో రెండు చొప్పున ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ ఎంతో కీలకమైనందున, ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలికారు. ఈ దిశగా ఓటర్లను చైతన్యపరుస్తూ ఈ.వీ.ఎం, వి.వి.ప్యాట్ ల గురించి అవగాహన కల్పించేందుకు ప్రచార రథాలు గ్రామగ్రామాన సంచరిస్తాయని అన్నారు. కార్యక్రమంలో డీసీఓ సింహాచలం, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.