నిజామాబాద్, జూలై 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర ఎంతో కీలకమైనందున అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.
ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ, పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో శాసనసభా నియోజకవర్గాల వారీగా సంచార రథాల (మొబైల్ వాహనాల) ద్వారా గ్రామగ్రామాన ప్రచారం చేయిస్తున్నామని అన్నారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో రెండు సంచార రథాల చొప్పున, బాన్సువాడ సెగ్మెంట్ సహా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 12 వాహనాల ద్వారా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ె
ంండు రోజుల క్రితం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంచార రథాలను జెండాఊపి లాంఛనంగా ప్రారంభించిన విషయాన్ని జిల్లా పాలనాధికారి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంచార వాహనాల ఇంఛార్జీల వద్ద కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచడం జరిగిందని, 2023 అక్టోబర్ 01వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారంతా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా పాలనాధికారి సూచించారు.
ఈవీఎంల పనితీరుపై అవగాహన కోసం ప్రత్యేక కేంద్రాలు : కలెక్టర్
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ల పనితీరుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఈవీఎం డెమోన్ స్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ కు సంబంధించి నగర పాలక సంస్థ కార్యాలయంతో పాటు ఐ.డీ.ఓ.సి (కలెక్టరేట్)లో ఈవీఎం, వి.విప్యాట్ ల ప్రయోగాత్మక పరిశీలన కేంద్రాలు నెలకొల్పామన్నారు.
అలాగే, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయాలలో, బాల్కొండ సెగ్మెంట్ కు సంబంధించి భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో డెమోన్ స్ట్రేషన్ సెంటర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, జిల్లాలో మొత్తం ఏడు కేంద్రాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు ఈ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవడంతో పాటు ఈవీఎం, వివి.ప్యాట్ ల పనితీరుపై ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.