మహాకవి దాశరథి జీవితం ఆదర్శప్రాయం. తన రచనతో సాహిత్యంలో ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ప్రతి ఒక్కరి హృదయాలపై తనదైన ముద్రను వేశారు.
ఈ సందర్భంగా ప్రజాకవి దాశరథి తన సాహిత్యంలో స్త్రీల పాత్రలను మలచిన తీరు ప్రశంసించదగినది. ఆయన రచించిన మహాశిల్పి జక్కన, స్వాతంత్య్ర వాహిని, నేనొక్కణ్ణేకాదు, యశోధర.. అనే నాటికలను పరిశీలిస్తే మనకు అనేక విషయాలు గోచరిస్తాయి. ‘యశోధర’ నాటిక ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
మహాకవి దాశరథి మహాకవి జక్కనలో ప్రధానపాత్ర అయిన మల్లిక నాట్యకారిణి అయినప్పటికిని కొన్ని నైతిక నియమాలకు కట్టుబడి తాను పేమ్రించిన జక్కనను వివాహమాడుటయే కాక, అతను దూరం అయినప్పుడు కూడా దుర్మార్గుడైన రాజును ఎదురించి అడవులలో ఎన్నో కష్టాలకోర్చి తన కొడుకైన డంకనను తన తండ్రి వద్దకు చేరునట్లు చేసిన ధీరవనిత మల్లిక. ఇంకా ఇందులో రంగాజమ్మ, కరుణ పాత్రలను కూడా సందర్భోచితముగా సృజించి నాటికకు వన్నె తెచ్చినారు.
మరొక నాటికలో అహింసా మార్గము కాదు, హింసా మార్గము కాదు… రెంటిని సమదృష్టితో చూడాలని సరస్వతి అనే పాత్రద్వారా మనకు తెలియపరుస్తారు రచయిత. చివరికి… నీవే గెలిచావమ్మ… అని మరోపాత్ర ద్వారా అనిపిస్తారు. ఇతర పాత్రలకన్నా సరస్వతి పాత్రను వున్నతంగా చూపించారు మనకు.
నేను ఒక్కణ్ణే కాదు అన్న నాటికలో తను ప్రేమించిన పార్థసారధికి చేదోడువాదోడుగా వున్న లీలను తాను నమ్మిన సిద్ధాంతం కోసం తానాదరించి వెళ్ళిపోయిన పార్థసారధికన్న ఉన్నత స్థానంలో నిలబెడతారు దాశరథి. దాశరథి గారు సానుభూతి, సిద్ధాంతం కోసం విడిచివెళ్ళిన పార్థసారధి మీద కాక విడువబడిన లీలమీదనే వుందనిపిస్తుంది.
ఈ నాటికల్లో ‘యశోధర’ తలమానికం వంటిది. ఒక అపూర్వ కళాఖండం.
ఏ తప్పు చేయని భర్తచే విడిచిపెట్టబడిన యశోధర వలవంత చరిత దాశరథి గారి మనసును కలిచివేసింది. ఆమె అవస్థను దాశరథి గారు అత్యంత ప్రతిభతో వర్ణించారు. ఆమె పాత్ర చిత్రణ చదువరుల హృదయాలను చూరగొంటుంది. చిరస్మరణీయురాలవుతుంది.
దాశరథి తన రచనలలో స్త్రీల హృదయాలను యథాతథంగా ఆవిష్కరించారు. మెదడుతో కాక మనస్సుతో సమస్యలను పరిష్కరించాలని చాటిచెప్పిన వ్యక్తి దాశరథి.
కవిగా, వ్యక్తిగా ఎంతో ఉన్నతుడైన దాశరథికి మనమంతా నేడు ఆయన 98వ జయంతి సందర్బంగా నివాళులర్పిద్దాం!
– తుర్లపాటి లక్ష్మి.