నిప్పులు కురిసిన దాశరథి…

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్‌ జిల్లా, మానుకోట తాలూకా, చినగూడూరులో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి వెంకటమ్మ, దాశరథి వెంకటాచార్యులు.
దాశరథికి మొదటి గురువు వారి తండ్రిగారే. ఆతడు సంస్కృత విద్వాంసులు. తెలుగు, తమిళంలో కూడా మంచి పాండిత్యం గలవారు.


తెలుగు సాహిత్యం మీద దాశరథికి ఆసక్తిని కలిగించింది వారి తల్లిగారు. అలా చిన్నతనంలోనే దాశరథికి సాహిత్యాభిలాష పెరిగింది. పండిత కుటుంబమే గాని సంపన్న కుటుంబం కాదు. పేదరికం వల్ల కలిగే బాధల్నీ, సమస్యలను దాశరథి చిన్ననాటి నుండే అనుభవించాడు. ఈతని బాల్యం ఖమ్మం జిల్లా ఇల్లెందు తాలూకా ‘గార్ల’ అనే గ్రామంలో గడిచింది. ఆ రోజుల్లో ఇదొక జాగీరు. గార్ల జాగీర్దార్‌ చేసే అన్యాయాలు, దోపిడీ, అణచివేతలను ప్రత్యక్షంగా చూశాడు. అవన్నీ అతని మనసులో చెరగని ముద్రవేశాయి.


తెలంగాణా స్వాతంత్రోద్యమం సాగుతున్న రోజుల్లో దాశరథి కొన్నిరోజులు కమ్యూనిస్టులతో కలిసి పనిచేశాడు.
నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో దాశరథి చురుగ్గా పాల్గొనడం – 1946 లోనే నిజాంకు వ్యతిరేకంగా గేయాలు ఎక్కువ భాగం అప్పుడు రాసినవే.


గార్లలో వున్న దాశరథి అరెస్టయ్యాడు. అతణ్ణి వరంగల్‌ జైలుకు పంపారు. వరంగల్‌ నుండి 30 మంది ఖైదీలు 1948లో నిజామాబాద్‌ జైలుకు మార్చబడిన వారిలో దాశరథి ఒకడు. అక్కడే వట్టికోట ఆళ్వారుస్వామితో పరిచయమయింది. ఆ జైలు గోడలపైనే దాశరథి ఆనాడు రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే ఏక వాక్యం ఓ కావ్యంగా ప్రసిద్ధిపొందింది.


తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో కవులు ఉద్భవించారు. అలాంటివాడే దాశరథి. అటు జైలు జీవితం అనుభవిస్తూ ఇటు నిరంతరం సాహిత్యాన్ని సృష్టించిన గొప్పయోధుడు.
ఆ రోజుల్లో నిజాం అనుచరులైన జాగీర్దార్లు, జమీందార్లు, దొరలు, దేశ్‌ముఖులు సామాన్య ప్రజల్ని, ఆడవారిని, రైతులను తీవ్ర కష్టాలపాలు చేశారు. అలా చూసి కలత చెందిన దాశరథి ‘రైతుదే’ తెలంగాణమని, ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్‌ బడగొట్టి మంచి మా / గాణములన్‌ సృజించి, ఎముకల్‌ నుసిజేసి పొలాలు దున్ని / బోషాణములన్‌ నవాబుకు / స్వర్ణము నింపిన రైతుదే / తెలంగాణము రైతుదే – సేద్యం చేసే రైతుకు భూమిలేదు, పుట్రలేదు. రైతుల రక్తంత్రాగే జమీందార్ల కెస్టేట్లు –
ఓ నిజాం పిశాచమా! కానరాడు
నిన్నుబోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ, కోటి రతనాల వీణ
అంటూ నినదించిన దాశరథి 98వ జయంతి రోజున మనమంతా ఘన నివాళినర్పిద్దాం!

                                 - ఎనిశెట్టి శంకర్‌

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »