పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది..ప్రజలు ఆందోళన చెందవద్దు

నిజామాబాద్‌, జూలై 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నాలుగైదు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేశామని అన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

ప్రస్తుత సమయంలో ఎవరు కూడా సెలవుల్లో వెళ్లకుండా, పూర్తి అప్రమత్తతో విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో ఆయన కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డిలతో కలిసి జిల్లాలో భారీ వర్షాల వల్ల నెలకొని ఉన్న పరిస్థితుల గురించి సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టం, దెబ్బతిన్న రహదారులు, పాక్షికంగా/పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లు, తెగిన చెరువులు, వాగులు, నీట మునిగిన విద్యుత్‌ ట్రాన్స్ఫార్మర్లు, కూలిన కరెంటు స్తంభాలు తదితర వివరాలను శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీస్తూ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా సత్వర చర్యలు తీసుకోవాలని, వరద ఉధృతి తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పక్కాగా వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని, అనవసరంగా ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ప్రభావంతో వ్యాధులు ముప్పిరిగొనకుండా ముందస్తుగానే అప్రమత్తతో కూడిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

అన్ని పీ.హెచ్‌.సీలలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, అన్ని రకాల మందుల నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపై దృష్టి సారిస్తూ, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు సమర్ధవంతంగా ప్రజలకు సేవలందించేలా అప్రమత్తం చేయాలన్నారు. కలెక్టరేట్‌, రెవెన్యూ డివిజనల్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ లకు వర్ష ప్రభావిత ప్రాంతాల నుండి ఏదైనా సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని సమాయత్తపర్చాలని మంత్రి అధికారులకు హితవు పలికారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తతతో కూడిన చర్యలు సమర్ధవంతంగా చేపడుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ తమ కార్య స్థానంలోనే ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

ముఖ్యంగా పురాతన కాలం నాటి ఇండ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, భోజన వసతి సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. విద్యుత్‌ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. మునుపెన్నడూ లేనివిధంగా జిల్లాలోని పలు ప్రాంతాలలో కుంభవృష్టి కురియడంతో కొన్ని చెరువులు, వాగులు తెగిపోయి రోడ్లు కొట్టుకుపోయాయని, సుమారు ఐదు వేల ఎకరాలలో వివిధ రకాల పంటలకు ఇసుక మేటలు వేయడం, నీట మునగడం వల్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.

వరద నీటి ప్రవాహం తగ్గిన మీదట పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. 14 చోట్ల పంచాయతీరాజ్‌ రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు. వాటిలో నాలుగు రోడ్లు చెడిపోగా, నీటి ప్రవాహానికి మరో పది రోడ్లు తెగిపోయాయని వివరించారు. ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు సంబంధించి ఆరు చోట్ల కొంత మేర కొట్టుకుపోగా, 17 ప్రదేశాలలో రోడ్లపై నుండి వర్షపు జలాలు ప్రవహిస్తున్నాయని అన్నారు. కొన్నిచోట్ల పురాతన ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 21 కరెంటు స్తంభాలు పడిపోయాయని, రెండు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగామని మంత్రి వివరించారు. అయితే ఎక్కడ కూడా విద్యుత్‌ సరఫరా నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, నీటి ఉధృతి తగ్గిన వెంటనే దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలను పునరుద్ధరిస్తామని తెలిపారు.

ఎక్కడా ప్రాణనష్టం సంభవించలేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, కుంటల వద్దకు వెళ్లవద్దని హితవు పలికారు. ముఖ్యంగా చేపలు పట్టే వారు, ఈత సరదా కోసం పిల్లలు, యువత చెరువులు, వాగులోకి దిగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరైనా ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకుంటే తక్షణమే డయల్‌ 100 కు లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ కు సమాచారం అందించాలని సూచించారు.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లా, డివిజనల్‌ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఊహించని రీతిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా అంతటా అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలం సీజన్‌ ముగిసేంత వరకు కూడా అనుక్షణం అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తూ, ప్రతి ఒక్కరు వారివారి కార్యస్థానాల్లో అందుబాటులో ఉండేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని జిల్లా అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

ముఖ్యంగా పంచాయతీరాజ్‌, వైద్యారోగ్య, రెవెన్యూ, ఇరిగేషన్‌, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులు, సిబ్బంది పరిస్థితులకు అనుగుణంగా అప్రమత్తతో విధులను సమర్ధవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ సూచించారు. సమీక్ష సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌ వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

చిన్ననాటి నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »